స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చాడు. సీనియర్ నేతల హోదాలో వివిధ జిల్లాల్లో ఎవరికి వారు తమ వారసులను రంగంలోకి దింపేందుకు రెడీ అయిపోయారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ స్ధానాలతో పాటు మేయర్ స్ధానాలపై కన్నేసిన సీనియర్లు తమ వారసులను ఇపుడు ఎన్నికల్లో దింపుతున్నారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న సేఫ్ సీట్లను వెతుక్కుని మరీ వారసులను దింపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

 

ఇలాంటి సమయంలోనే పగన్ పెద్ద షాక్ ఇచ్చాడు. వారసులకు నో పదవులు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. వారసులను అందలాలు ఎక్కించేందుకు ఇప్పటికే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. నెల్లూరు, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో వారసుల హడావుడి పెరిగిపోయింది. దాంతో మిగిలిన నేతలతో పాటు కార్యకర్తల్లో  అసహనం పెరిగిపోతోంది.

 

పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు జెండాలు మోసి దెబ్బలు తిని జైళ్ళకు పోయిన నేతలు, కార్యకర్తలకు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అయినా పోటి చేసే అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇపుడు కొందరు నేతలు తమ వారసులనే రంగంలోకి దింపుతుండటంతో ఏమి చేయాలో ఎవరికీ అర్ధం కాలేదు. వారసులు పోటిలోకి దిగారంటే కచ్చితంగా జిల్లా పరిషత్ ఛైర్మన్, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ పదవులపైనే కన్నేస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 

ఇదే విషయమై సోషల్ మీడియాలో కార్యకర్తల, జగన్ అభిమానుల మనోభీష్టాలపై విస్తృతమైన ప్రచారం జరిగింది. దీంతో ఇదే విషయం జగన్ దృష్టికి కూడా వెళ్ళిందట. వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వారసులకు నో పదవులు అంటూ నిర్ణయించారు. నిర్ణయించటమే కాకుండా వెంటనే పార్టీలోని ముఖ్య నేతలకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. ఎప్పుడైతే జగన్ ఆదేశాల పేరుతో మీడియాలో ప్రముఖంగా వచ్చిందో వెంటనే సీనియర్ నేతలతో పాటు వారసుల్లో కూడా ఉత్సాహం చల్లారిపోయిందిట. అదే సమయంలో ఇతర నేతలు, కార్యకర్తల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. మరి చూద్దాం చివరకు ఏం జరుగుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: