ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కాస్తోకూస్తో ఆశలు ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది అమరావతి విస్తరించి ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాలు మాత్రమే. జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడంతో తెలుగుదేశం పార్టీ గత మూడు నెలలుగా అమరావతి ప్రాంతంలో ఉద్యమానికి తెర లేపింది. అక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఉండటంతో ఈ రెండు జిల్లాల్లో పార్టీకి ప‌ట్టు దొరికింది అన్న భావన తెలుగుదేశం పార్టీ అధిష్టానం లో ఉంది. అయితే వాస్తవంగా కొంతమంది మాత్రమే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారే తప్ప మెజార్టీ ప్రజలు మూడు రాజ‌ధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

 

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ ఈ రెండు జిల్లాల్లో త‌మ తిరుగులేద‌ని టీడీపీ భావిస్తున్నా అటు ఆ పార్టీ కంచుకోట‌లు మాత్రం కూలిపోతున్నాయి. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మంత్రి కొడాలి నాని ప్రాథినిత్యం వ‌హిస్తోన్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ కౌన్సెల‌ర్ల నుంచి ప‌లువురు స్థానిక సంస్థ‌ల మాజీ ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ వైసీపీలోకి వ‌చ్చేస్తున్నారు. ఇక టీడీపీ కీల‌క నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నియోజ‌క‌వ‌ర్గం అయిన‌ మైలవరం నియోజకవర్గం రెడ్డి గూడెంలో టీడీపీ నేత రామినేని వెంకటేశ్వరరావు తన అనుచరులు 50 మందితో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

 

విజయవాడ పశ్చిమ, నందిగామ‌, తిరువూరు, కైకలూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు  వైఎస్సార్‌ సీపీ వైపు అడుగులు వేశారు. అటు విప్ సామినేని ఉద‌య‌భాను నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గ‌య్య‌పేట‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన టీడీపీ నేత‌లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అస‌లు ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను సైతం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దీంతో పార్టీ కీల‌క నేత‌లు కూడా ఇప్పుడు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం త‌మ దారి తాము చూసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: