ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామం హోరెత్తుతోంది. ఎక్కడికక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాదోపవాదాలు, దాడులు జరుగుతున్నాయి. రెండు పార్టీలు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీల‌క‌మైన‌ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు పై కొందరు వ్యక్తులు దాడిచేసి.. అద్దాలు పగలగొట్టడంతో కారులో ఉన్న కొంద‌రికి గాయాలు అయ్యాయి.

 

ఈ సంఘ‌ట‌న‌పై పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘ‌ట‌న‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మండిపడ్డారు. ప‌ల్నాడులో ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణం చెడ‌గొట్టేందుకే వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారని పిన్నెల్లి ఆరోపించారు.

 

టీడీపీ నేత‌ల కార్లు స్పీడ్‌గా రావ‌డంతో ఒక పిల్లాడికి త‌గిలి గాయాలు అయ్యాయని.. దీంతో స్థానికులు ఆగ్ర‌హించ‌డంతో వారిని స‌ముదాయించాల్సిన టీడీపీ నేత‌లు వారిపైనే తిర‌గ బ‌డ్డార‌ని పిన్మెల్లి చెప్పారు. టీడీపీ ప్ర‌శాంతంగా ఉన్న ప‌ల్నాడు వాతావ‌ర‌ణాన్ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో పూర్తిగా క‌లుషితం చేస్తోంద‌ని... ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. వాటిని త‌నకు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పిన్మెల్లి మండిప‌డ్డారు.

 

అయితే టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇదే ప‌ల్నాడు లో పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని టీడీపీ వాళ్లు వైసీపీ నేత‌ల‌పై , కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఇప్పుడు ఇదే సీన్ రివ‌ర్స్‌లో జ‌రుగుతోంది. నాడు త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై చంద్ర‌బాబు నోరు మెద‌ప‌లేద‌ని.. నేడు ఆయ‌న మోస‌లి క‌న్నీరు ఎందుకు కారుస్తున్నార‌ని వారు మండి ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: