ప్రపంచ దేశాలను కొవిడ్ 19 గడ గడ లాడిస్తున్నవేళ, భారత్ కు ఏమీ కాదని ధీమాగా వున్న తరుణంలో ఓ పిడుగులాంటి వార్త యావత్ ఇండియాను కుదిపేస్తోంది అని ఎవరూ ఊహించలేదు. అవును.. కరోనా వైరస్‌ వలన కర్ణాటకలో ఓ వ్యక్తి చని పోయాడనే వార్త ప్రస్తుతం తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఒక వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో కల్బుర్గీ మెడికల్‌ కళాశాలలో చేర్పించారు. 

 

కొద్ది రోజుల చికిత్స అనంతరం, అతని పరిస్థితి చాలా ప్రమాదపు అంచున ఉందనే అనుమానంతో అతన్ని కల్బుర్గీ నుంచి మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు... సదరు  వైద్యులు. అయితే చికిత్స పొందుతూనే, ఈరోజు అనగా.. బుధవారం మధ్యాహ్న సమయంలో బాధితుడు మృతి చెందినట్లు వెల్లడైంది. అయితే మృతి చెందిన వ్యక్తిని మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీగా గుర్తించిన వైద్యులు అతని మరణం కరోనా కారణంగానే సంభవించిందని మాత్రం నిర్థారించలేకపోవడం ఇక్కడ కొసమెరుపు. 

 

ఇక దానితో అతని శాంపిల్స్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలకు రిఫర్‌ చేశామని, రిపోర్టులు అందిన తరువాతనే మృతిపై సరియైన నిర్థారణకు వస్తామని, తరువాత అధికారికంగా ప్రకటిస్తామని వైద్యులు తెలపడం గమనార్హం. అయితే, భారత ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు అనేది సారాంశం. ఇక బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా 52 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసినదే.

 

కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. సదరు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. బయట దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, కుటుంబాలకే వైరస్‌ సోకిందే తప్ప, రాష్ట్రంలో ఉంటున్న వారిలో ఎవరికీ కరోనా వైరస్ సోకిన దాఖలాలు లేవని, ఈ విషయమై ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని, మాస్కులు ధరించాల్సిన అవసరం కూడా లేదని చెప్పడం ఇపుడు పలు చర్చలకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: