కర్నూలు జిల్లాలో ఒక గ్రామం పంచాయతీగా ఏర్పడి 26 సంవత్సరాలైనా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా పాలక వర్గాన్ని ఎన్నుకుంటూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలులోని తుగ్గలి మండల కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరు నునుసరాళ్ల. 26 సంవత్సరాల క్రితం ఈ గ్రామం బొందిమడుగుల పంచాయతీలో ఉండేది. 
 
1994 లో ప్రత్యేక పంచాయతీగా ఈ గ్రామం ఏర్పడింది. అప్పటినుండి ఈరోజువరకు ఈ గ్రామంలో పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీలో మొత్తం 218 కుటుంబాలు నివశిస్తున్నాయి. గ్రామ జనాభా 1219 ఉండగా వీరిలో 803 మంది ఓటర్లు ఉన్నారు. కులాల వారీగా బీసీ ఓటర్లు 546, ఎస్సీ ఓటర్లు 72, ఇతరులు 185 మంది ఉన్నారు. గ్రామపంచాయతీ ఏర్పడిన రోజు నుండి నాయకులు, పంచాయతీ ప్రజల సహకారంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 
 
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ గ్రామంలో 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొదటి సర్పంచ్ గా దారెడ్డి రంగారెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. 2000లో జరిగిన ఎన్నికల్లో కొండమ్మ, 2006 ఎన్నికల్లో ఉమాదేవి, 2013లో లక్ష్మీనారాయణ ఈ గ్రామం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
నునుసరాళ్లలో ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్నందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఏకగ్రీవ పంచాయతీకి ప్రోత్సాహకం కింద ఇచ్చింది. 2013లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికవ్వటంతో ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ప్రోత్సాహకం కింద ఇచ్చింది. ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన నగదుతో తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.                   

మరింత సమాచారం తెలుసుకోండి: