ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్రంలో వైసీపీ ఓటర్లను ప్రభావితం చేసే పథకాల అమలును నిలిపివేయాలని సూచించారు. ఉగాదికి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టరాదని చెప్పారు. ఆ పథకం అమలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వం నిర్వహించే సమావేశాలు, రివ్యూలు కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తాయని చెప్పారు. ఎవరైనా నామినేషన్లు వేసే సమయంలో వారిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఎన్నికల కమిషన్ వారిపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని పోలీసులపై తనకు నమ్మకం ఉందని వారు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ భవనాలకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణీత గడువులోపు వైసీపీ రంగులు తొలగిస్తామని చెప్పారు. అధికారులు అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను అందించటంలో నిర్లక్ష్యం వహించరాదని సూచనలు చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 15న విడుదల చేస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఈ పథకం అమలు వాయిదా పడనుంది. 
 
ప్రభుత్వం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఉగాది పండుగ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ జరగకపోతే ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: