రాష్ట్రం నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా పరిమల్ నత్వానీ పేరు ఖరారైంది. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సిఫారసుతో .. నత్వానీ ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లనున్నారు. సహజంగా జాతీయ పార్టీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు.. వేరే రాష్ట్రాల నుంచి పెద్దలసభకు పంపడం ఆనవాయితీ... అయితే ఓ ప్రాంతీయ పార్టీగా..రాష్ట్రేతరుడికి రాజ్యసభ స్థానాన్ని కేటాయించి, సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది వైసీపీ. దీంతో..ఇటీవలి కాలంలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లిన నేతల పైనా చర్చ జరుగుతోంది.

 

రాజ్యసభ స్థానాల కేటాయింపు విషయంలో అధికార వైసీపీ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. రాష్ట్రేతరుడికి రాజ్యసభ స్థానాన్ని కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫలితంగా గుజరాత్‌కుచెందిన పరిమల్ నత్వానీ.. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దలసభలో అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే రెండుసార్లు జార్ఖండ్‌ నుంచి .. రాజ్యసభకు నత్వానీ ప్రాతినిధ్యం వహించారు. మూడో దఫా పరిమల్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సిఫారసు ఫలించింది. నత్వానీకి రాజ్యసభ స్థానం ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విషయంలో తన వంతు పాత్ర పోషిస్తానని.. పరిమల్ హామీ ఇచ్చారు. 

 

నత్వానీకి రాజ్యసభ టికెట్‌ కన్‌ఫర్మ్‌ కావడంతో .. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజ్యసభకు  ప్రాతినిధ్యం వహించిన నేతల గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. సదరు నేతల వల్ల రాష్ట్రానికేమైనా ప్రయోజనాలు ఒనగూరాయా..? అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు దశాబ్దాల కాలంలో నత్వానీ సహా నలుగురు రాష్ట్రేతరులు ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1990 నుంచి 96 వరకు ఆర్కే ధావన్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఎంపీగా వ్యవహరించారు. ఆ తర్వాత రషీద్ అల్వీ రెండు టర్ముల్లో ఎనిమిదేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 2004 నుంచి 2006 వరకు.. ఆ తర్వాత మళ్లీ 2006 నుంచి 2012 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచే మరో కీలక నేత జైరామ్ రమేష్ రెండుసార్లు ఏపీ నుంచి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు.2004 నుంచి 2016 వరకు ఏకంగా 12 ఏళ్ల పాటు రాష్ట్రం తరపున రాజ్యసభలో కొనసాగారు. 

 

ఎన్డీఏ హయాంలో టీడీపీ మద్దతుతో రెండేళ్ల పాటు నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 2016 వరకు రాజ్యసభలో ఎంపీగా ఉన్న నిర్మల.. తమిళనాడుకు చెందిన నేతే అయినా.. తెలుగింటి కోడలు. 2016లో రాజ్యసభకు ఎన్నికైన సురేష్ ప్రభు.. . ఏపీ తరుపున రాజ్యసభలో కొనసాగుతున్నారు.  ఇప్పుడు పరిమల్ నత్వానీకి అవకాశం రావడంతో.. 2020 నుంచి ఆరేళ్లపాటు ప్రాతినిథ్యం వహించనున్నారు.

 

రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇతర ప్రాంత నేతల వల్ల ఏమైనా లాభం ఉందా.. అనే చర్చ నడుస్తోంది. ఆర్కే ధావన్.. రషీద్ అల్వీ వంటి వారు రాజ్యసభలో ఉన్న రోజుల్లో..కేంద్ర సాయం  పెద్దగా అవసరం లేకపోయేది.  జైరామ్ రమేష్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన రోజుల్లో మాత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన జరిగింది. ఈ విభజనలో జైరామ్ రమేష్ కీలక పాత్రధారిగా ఉన్నారు. అలాగే సురేష్ ప్రభు విషయానికొచ్చేసరికి ప్రత్యేక ప్యాకేజీ .. ఆర్థిక లోటు, విభజన హామీల అమలు కీలకంగా ఉన్నాయి. దీన్ని ఆ స్థాయిలో అడ్రస్ చేసిన దాఖలాలు లేకున్నా.. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులు, ఇతర పెండింగ్ విషయాలను పరిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఏమైనా ప్రతిపాదనలు వెళ్తే.. వాటిని వీలైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేసేవారని సురేష్‌ ప్రభు గురించి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఉంది. పరిమల్ నత్వానీ నుంచి రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుందో.. ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: