రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు చేయడానికి సిద్ధమై, ఆ మేరకు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. కానీ టీడీపీ మూడు రాజధానుల వద్దు అమరావతిలోనే మొత్తం రాజధానిగా ఉండాలంటూ పోరాటాలు, ఉద్యమాలు చేస్తోంది. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు కూడా 80 రోజులపై నుంచి నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ వారి ఉద్యమం కొనసాగుతూనే ఉంది.

 

అలాగే ఈ మూడు రాజధానులని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే వాదనలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఈ రెండు జిల్లా ప్రజలు మూడు రాజధానులని ఏ మేర వ్యతిరేకిస్తున్నారనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోనుంది. స్థానికంలో రెండు జిల్లాల వారు మెజారిటీ స్థానాలు టీడీపీకి కట్టబెడితే అమరావతి రాజధానిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తే మూడు రాజధానులైన పర్వాలేదు అనే సంకేతాలు వస్తాయి.

 

ఈ రాజధానిపై ఇంకా బాగా క్లారిటీ రావాలంటే, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్స్‌ ఫలితాలు బట్టి తెలుస్తోంది. ఈ రెండు కార్పొరేషన్స్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అమరావతి ప్రభావం ఈ నగరాలపై గట్టిగా ఉంది. దీంతో ఈ రెండు చోట్ల టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశముంది. అలాగే ఈ రెండు చోట్ల టీడీపీ నాయకత్వం స్ట్రాంగ్‌గానే ఉంది. కాకపోతే గుంటూరుతో పోలిస్తే, విజయవాడలోనే టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

 

అయితే అధికారంలో ఉండటం వైసీపీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్. అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాల్సిన అవసరముంటుంది. ఇక ప్రజలు అలా చూసుకుంటే వైసీపీని గెలిపించవచ్చు. ఒకవేళ వైసీపీ గెలిస్తే ఈ రెండు జిల్లాల ప్రజలు కూడా మూడు రాజధానులకు మద్ధతుగా ఉన్నారని చెప్పి జగన్ ఇంకా దూకుడుగా వెళ్లొచ్చు. మరి చూడాలి ఈ రెండు కార్పొరేషన్స్‌లో ఎలాంటి ఫలితాలు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: