ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా షాకులు తగులుతున్నాయి. తెలుగు దేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు అనుకున్న నేతలు కూడా చివరకు ఇప్పుడు పార్టీని వదిలేందుకు సిద్ధమయ్యారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీనే అంటి పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు చంద్రబాబుకు సారీ చెప్పి జగన్ గూటికి చేరిపోతున్నారు.

 

 

ఇటీవలే కడప జిల్లాలో సతీశ్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఆ జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు జలక్ ఇచ్చి వైసీపీలో చేరారు. ఇక పార్టీలో కాస్తో కూస్తో గట్టిగా ఉన్న ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌ కూడా వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుగు దేశం పార్టీ కరపత్రికగా పేరున్న పత్రికే వార్త రాసింది.

 

 

అంటే ఇక కరణం బలరామ్ కూడా జగన్ పార్టీలో చేరినట్టే.. ఇప్పటికే జిల్లాలో బాలకృష్ణ సన్నిహితుడుగా పేరున్న కదరి బాబూరావు కూడా ఇటీవలే జగన్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పటికే జగన్ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు కరణం బలరామ్ కూడా వెళ్లిపోతే.. టీడీపీకి భారీ షాక్ అనే చెప్పుకోవాలి. కరణం బలరామ్ గురువారం లేదా శుక్రవారం జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

 

జగన్ పార్టీలో చేరే ఆలోచనతోనే కరణం బలరామ్ స్థానిక ఎన్నికల నామినేషన్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి కరణం బలరాం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చీరాలకు బలరాం నాన్ లోకల్ అయినప్పటికీ కృష్ణమోహన్‌పై ఆయన 17, 801 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చంద్రబాబుకు చాలా క్లోజ్ గా ఉండే కరణం వైసీపీలో చేరుతున్నారంటే.. నమ్మశక్యంగా లేకపోయినా అది వాస్తవం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: