గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ సీనియర్‌ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలను అడ్డగించిన వైసీపీ వర్గీయులు వారి వాహనాలపై దాడి చేసి కారు అద్దాలు ద్వంసం చేశారని టీడీపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనికి ప్ర‌తిప‌క్ష వైసీపీ ఘాటు కౌంట‌ర్ ఇచ్చింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ``గత స్థానిక ఎన్నికల్లో గుంటూరుజిల్లా ముప్పాళ్ళ మండలంలో టిడిపి చేసిన అరాచకం, దౌర్జన్యం మరిచిపోయారా చంద్రబాబూ? మా పార్టీ తరుఫున గెలిచిన ఎంపిటిసిలను ఎంపిపి ఎన్నిక కోసం తీసుకుపోతుంటే... మేడికొండూరు వద్ద దోపిడీదార్ల మాదిరిగా టిడిపి గుండాలు ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేశారు. మా పార్టీ ఎంపిటిసిలను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు.  అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తాఫాపై ఆనాడు జరిగిన దాడి విజువల్స్ ను కూడా ప్రజలు గమనించాలి`` అని  అప్పుడు జరిగిన వీడియోను ప్రదర్శించారు.


``సీఎంగా ఉండి ఆనాడు చంద్రబాబు ఈ దాడిని, దౌర్జన్యాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? పల్నాడు ప్రాంతంలో తన హయాంలో ఏం జరిగిందో చంద్రబాబుకు తెలియదా? కోడెల శివప్రసాద్, ఆయన కొడుకు చేసిన దాడులు, అరాచకాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు ఎన్ని అరాచకాలు చేశారో అందరికీ తెలుసు.`` అని గోపిరెడ్డి తెలిపారు. 

 


టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నలకు మాచర్లలో పనేంటని గోపిరెడ్డి ప్ర‌శ్నించారు. ``ఎన్నికల కోడ్ ఉండ‌గా... పది వాహనాలతో ఎలా ర్యాలీ చేస్తారు.? విజయవాడ నుంచి తమ వాహనాల్లో గుండాలను తీసుకుని పల్నాడుకు వస్తారా? పల్నాడు పౌరుషాల గడ్డ... టిడిపి గుండాలు చేసే దౌర్జన్యాలను అడ్డుకుంటాం. చంద్రబాబు తన పార్టీ నుంచి ప్రతిరోజూ నాయకులు బయటకు వస్తుండటంతో జీర్ణించుకోలేక పోతున్నారు.  అందుకే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నాడు. `` అని మండిప‌డ్డారు. ``స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. కానీ చంద్రబాబు స్పెషల్ ఆఫీసర్లను అడ్డుం పెట్టుకుని స్థానిక ఎన్నికలు జరగకుండా చూశారు.టిడిపి కార్యకర్తలకు మేలు చేసేందుకు, వారికి దోచిపెట్టేందుకు వీలు కల్పించాడు. ఈరోజు మద్యం ఎక్కడా దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మద్యం ప్రభావం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరిపేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జగన్ చేసిన సంస్కరణలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు.` అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: