11 మార్చి , 2011.. అది వైసీపీ ఆవిర్భవించిన రోజు.. ఆ రోజు జగన్ ఒక్కడు.. ఒంటరిగా ప్రస్థానం ప్రారంభించాడు. అప్పటికి ఆయనకు ఉన్నది ఒక్క వైస్సార్ వారసత్వం మాత్రమే. తన తండ్రి కష్టం ఫలితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తనను రాజకీయంగా దూరం పెట్టి.. కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో వైఎస్ జగన్ సొంత పార్టీని ప్రారంభించాడు. తండ్రి పేరు కలసి వచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశాడు.

 

 

మొదటి నుంచి జనంలో ఉన్న జగన్.. ను కేసులు వెంటాడాయి. వాటి ఫలితంగా ఆయన 16 నెలల వరకూ జైళ్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల జగన్ కు అండగా నిలిచారు. పార్టీని నడిపించారు. ఆ తర్వాత.. 2014 ఎన్నికల్లో విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. రుణ మాఫీ వంటి అంశాలపై అమలు చేయలేని హామీలు ఇవ్వలేనంటూ చెప్పడం అప్పట్లో ఆయనకు మైనస్ అయ్యింది. అయితే అదే విషయం ఆ తర్వాత కాలంలో ఆయన విశ్వసనీయత పెంచింది.

 

 

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ అప్పటి ప్రతిపక్షాన్ని సమూలంగా నిర్మూలించాలని దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నా జగన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒంటరిగానే పోరాటం సాగించాడు. తండ్రి బాటలోనే ఆయన చేపట్టిన పాదయాత్ర ఆయనపై జనంలో మరోసారి నమ్మకం పెంచింది. మాట తప్పను.. మడమ తిప్పనంటూ ఆయన ఇచ్చిన హామీలు జనం నమ్మారు. ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించాడు జగన్.

 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: