వైసీపీ తరపున రాజ్యసభ స్థానాలు ఖరారు కావడం, రాజ్యసభ స్థానాలు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలోనే మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉండడంతో మళ్లీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో కొత్త ఆశలు చిగురించాయి. జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమందికి తొలివిడతలో మంత్రి పదవులు దక్కుతాయని అందరూ అంచనా వేశారు. అయితే జగన్ మాత్రం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసి తన స్నేహితులందరికీ మొండిచేయి చూపారు. కొత్తగా ఎన్నికైన వారికి, ఎవరూ ఊహించని వ్యక్తులకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మంత్రి పదవులు ఆశించిన వారంతా జగన్ పై ఒక దశలో గుర్రుగా ఉన్నారు. అయితే మొదటి విడతలో దక్కక పోయినా రెండో విడతలో అవకాశం ఇస్తాం అంటూ కొంతమందికి జగన్ హామీ ఇచ్చారు.

 

IHG


 ఆ హామీ మేరకు రెండు మంత్రి పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఎమ్యెల్సీ పదవి ద్వారా మంత్రి పదవి పొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణకు శాసనమండలి రద్దయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే జగన్ వారికి రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. దీంతో వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఖాళీ కాబోతున్న రెండు స్థానాల్లో ఒక స్థానం తనకే దక్కుతుందని నగిరి వైసీపీ ఎమ్మెల్యే, జగన్ సన్నిహితురాలు ఆర్.కె రోజా ఆశలు పెట్టుకున్నారు. 

 

IHG

మొదటి విడతలోనే ఆమెకు అవకాశం దక్కుతుందని అంతా భావించినా, ఆమె రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తలు ఉండడం, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది అని భావించిన జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రచారం కూడా నడిచింది. ఎవరు ఎన్ని రకాలుగా వ్యవహరించినా జగన్ మాత్రం ఆమెకు రెండో విడతలో తప్పనిసరిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె తన సన్నిహితుల వద్ద చాలాసార్లు చెప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ స్థానంలో తనకు తప్పకుండా జగన్ అవకాశం ఇస్తారని రోజా ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ నిర్ణయం ఏవిధంగా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: