ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరవుతున్నా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు అదే స్థాయిలో దృష్టి పెట్టారు. తెలంగాణలో టిడిపి పూర్తిస్థాయిలో కనుమరుగైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నా.. చంద్రబాబు మాత్రం తెలంగాణలో పార్టీకి జీవం పోసి, తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకుల కొరత ఉన్నా, క్షేత్రస్థాయిలో బలంగా ఉందని,టిడిపిని ఆదరించే బలమైన కేడర్ ఇంకా చెక్కు చెదరలేదు అని బాబు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. 

IHG


ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ ఉన్నారు. అయితే ఆయన పనితీరుపై చంద్రబాబుకు అంతగా నమ్మకం లేనట్టుగా తెలుస్తోంది. రమణ కూడా పూర్తిస్థాయిలో పార్టీ పటిష్టత పై దృష్టి పెట్టకుండా.. ఏదో ఉన్నామా లేదా అన్నట్టు గా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కి సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అది కూడా తెలంగాణ లో చంద్రబాబు పర్యటన పెట్టినప్పుడో, లేక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చినప్పుడో మాత్రమే తప్ప, మిగతా సమయంలో కనిపించకపోవడం చంద్రబాబుకు కొంతమంది ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో రమణను తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు రమణనే బాధ్యతలు చూడాల్సిందిగా చంద్రబాబు కోరారట. 

IHG chandrababu


వారంలో ఒకరోజు తెలంగాణ టిడిపి కేటాయిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ మధ్య మధ్యలో వెళ్లడం చంద్రబాబుకు కుదరకపోవడంతో రమణ మీద మొత్తం బాధ్యతను పెట్టగా, ఆయన చంద్రబాబు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో పార్టీ గురించి పట్టించుకోవడం లేదని తెలంగాణ సీనియర్ నాయకులు కొంతమంది చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. దీంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలహీన పడడానికి కేవలం నాయకత్వ లోపమే కారణమని, చంద్రబాబు గుర్తించారు. బలమైన నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, మళ్ళీ వారు  తిరిగి పునర్వైభవం తీసుకువచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు.


 అందుకే తెలంగాణలో రమణ స్థానంలో మరో కొత్త అధ్యక్షుడిని నియమించి పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే ఇదంతా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత మాత్రమే, తెలంగాణపై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: