తానొకటి తలిస్తే పార్టీ నాయకులు మరొకటి తలచినట్టుగా తయారయింది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలి అనే తపనతో జగన్ ప్రతి నిమిషం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తూ, ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూనే పార్టీని కూడా బలోపేతం చేస్తున్నారు. జగన్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ, ఏపీలో ప్రవేశపెట్టిన పథకాలను తమతమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రయత్నాలు చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి. దీంతో జగన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అదే సమయంలో పార్టీలోను, ప్రభుత్వంలోను, ఎక్కడా అవినీతి లేకుండా జగన్ చేయగలుగుతున్నారు. 

 

IHG


ఇంత వరకు జగన్ పనితీరును అభినందించదగ్గ విషయమే అయినా, ఆయన పార్టీలోని కొంతమంది నాయకుల వ్యవహార శైలి కారణంగా జగన్ పై చెడు ముద్రలు పడిపోతున్నాయి. తాజాగా మాచర్ల లో టిడిపి నాయకులైన బోండా ఉమా, బుద్ధ వెంకన్నపై కొంతమంది దాడులు చేయడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిడిపి నేతలపై దాడి చేసింది వైసిపి నాయకులే అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారం వెనుక ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది స్పష్టంగా ఇంకా తేలియనప్పటికీ దాడి అయితే జరిగింది. దీంతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు టిడిపి ఈ అంశాన్ని హైలెట్ చేస్తోంది. 

 

IHG


మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ విషయాన్ని హైలెట్ చేయడం ద్వారా, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో ఇప్పటి వరకు జగన్ పై ఉన్న మంచి అనే ముద్ర కూడా చెరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. కేవలం కొంతమంది పార్టీ నాయకుల దూకుడు చర్యల వల్ల జగన్ వ్యక్తిత్వానికి మచ్చ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని వేచి చూసే టిడిపిపార్టీ అనుకూల మీడియా కు ఇది నిజంగా మంచి అవకాశం అని చెప్పాలి. ఎన్నికలు ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని ఏపీలో హైలెట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూనే.. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఎలా చూసుకు,న్నా ఈ పరిణామం వైసీపీకి, ముఖ్యంగా జగన్ కు మచ్చ తీసుకువచ్చే అంశంగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: