ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 15 నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని తెలిపింది. నిన్న పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు ఒంటిపూట బడులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు ఉదయం 7.50గంటల నుంచి 8గంటల వరకు ప్రార్థనా సమయంగా నిర్ణయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8గంటల నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలి. 
 
విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ లో రెండో శనివారం పాఠశాలలు పని చేయాలని ఆదేశించింది. ప్రతి పాఠశాలలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించవద్దని, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచనలు చేసింది. అన్ని పాఠశాలలు ఒంటిపూట బడులపై సమయ పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 
 
విద్యాశాఖ ఈ నెల 16 నుంచి ఎలిమెంటరీ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జి కోర్సులకు సంబంధించిన కొన్ని విధివిధానాలను సూచించింది. పిల్లలపై చదువు పట్ల అభిరుచి పెంచే విధంగా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సును ఏర్పాటు చేసింది. ఈ నెల 16న 50 మార్కులకు విద్యార్థులలోని సామర్థ్యాలను తెలుసుకోవడానికి బేస్ లైన్ టెస్ట్ ఉంటుంది. విద్యార్థులు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. 
 
బ్రిడ్జి కోర్సు పూర్తైన 30 రోజుల తర్వాత విద్యార్థులకు ఎండ్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ బ్రిడ్జి కోర్సును సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా కొనసాగించాలి. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు సమయంలో ఎలాంటి నోట్ బుక్స్ అవసరం లేదు. విద్యాశాఖ వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్  అందిస్తుంది. పాఠశాల యాజమాన్యాలు ఏప్రిల్ 23న పేరెంట్స్ యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రోగ్రెస్ ను తల్లిదండ్రులకు తెలియజేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: