ఏపీలో స్థానిక ఎన్నికల వేళ మాచర్ల ఘటన కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో బాగా ప్రచారం జరగడంతో వైసీపీ నష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఇదంతా టీడీపీ ఓవరాక్షన్ వల్లనే జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. 10 కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పది కార్లలో ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లడంతో మాచర్లలో చిన్నారులపై కార్లు దూసుకెళ్లాయన్నారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారన్నారు.



అంతే కాదు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాక్షస ఆనందం పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి బొత్స హెచ్చరించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ అలజడులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.



" మాచర్లలో చిన్న పిల్లలకు ప్రమాదం జరిగితే.. దాన్ని పట్టుకొని చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పార్టీ అధ్యక్షుడిని అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమైనా ఉంటే.. అతన్ని విడిచి ఆ పార్టీ నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి చంద్రబాబు అన్యాయాన్ని వివరించాడు. విశాఖలో పంచకర్ల రమేష్‌ చంద్రబాబు మోసాన్ని వివరించాడు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరాడని మంత్రి బొత్స అన్నారు.



ఈ రాష్ట్రం శాంతిభద్రతలకు ఆటంకం కలగాలి.. కొట్లాటలు, విధ్వంసాలు జరగాలని, తద్వారా రాక్షసానందం పొందాలని చంద్రబాబు చూస్తున్నాడు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా.. దానికి ఆయన మీడియా మద్దతు పలికినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. జిల్లాల్లో శాంతిభద్రతలు ఏ విధంగా పరిరక్షిస్తున్నారో.. ఎన్నికలు శాంతియుతంగా జరగాలని ప్రభుత్వం కృషిచేస్తోందంటున్నారు మంత్రి బొత్స.

మరింత సమాచారం తెలుసుకోండి: