కర్నూలు జిల్లాలో బుధవారం రోజు నామినేషన్లు వేయడానికి వెళ్లిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో దౌర్జన్యంగా అభ్యర్థులను అపహరించి వైసీపీ నేతలు బెదిరించే ప్రయత్నాలు చేశారని సమాచారం. పలు మండలాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడంతో ఏకగ్రీవం అవుతున్నాయి. జిల్లాలో కోసిగి, రుద్రవరం, చిప్పగిరి, అవుకు ప్రాంతాలలో ఎంపీటీసీ అభ్యర్థుల కిడ్నాప్ ల వ్యవహారం కలకలం రేపింది. 
 
మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో టీడీపీ అభ్యర్థులు, రామయ్య, హుస్సేన్ లను వైసీపీ నాయకులు అపహరించారని జిల్లాలో కలకలం రేగింది. కౌతాళం మండలం బదినేహాల్ లో టీడీపీ అభ్యర్థిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. అభ్యర్థిని భర్తను భయపెట్టటంతో అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయలేదని సమాచారం. 
 
కొలిమిగుండ్లలో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన రామకృష్ణ ప్రసాద్ ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వైసీపీ బెదిరింపుల వల్లే ఆయన వెళ్లిపోయారని ఆరోపణలు వినిపించాయి. ప్యాపిలి మండలం పెద్దపూపెళ్ల గ్రామంలో టీడీపీ తరపున లక్ష్మీదేవి నామినేషన్ వేయడానికి వెళుతుండగా వైసీపీ నాయకుడు నామినేషన్ పత్రాలను లాక్కొని పారిపోయారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన రెడ్డి వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. 

 
కర్నూలు జిల్లాలో నిన్నటితో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ముగిసింది. నిన్న భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నిన్న కర్నూలు జిల్లా కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నందికొట్కూర్, డోన్, ఆదోని మున్సిపాలిటీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: