తెలంగాణ ప్ర‌భుత్వం త‌న అర్థిక అభివృద్ధికి స‌హ‌క‌రించే రెండు కీల‌క‌మైన న‌గ‌రాల విష‌యంలో ముఖ్య నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌ధాని హైద‌రాబాద్‌, ద్వితీయ శ్రేణి న‌గ‌రంగా ఎదుగుతున్న వ‌రంగ‌ల్ విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఐటీ, పరిశ్రమల, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తాజాగా ఈ వివరాలు వెల్ల‌డించారు. హైదరాబాద్‌ మెట్రోరైలు త్వ‌ర‌లో ఓల్డ్‌సిటీలో ప‌రుగులు పెట్ట‌నుంద‌ని ఆయన తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని కేటీఆర్ వెల్ల‌డించారు.

 

పాత‌బ‌స్తీలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5 కి.మీ. మేర మెట్రోకారిడార్‌ -2 పనుల నిర్వహణ చేపట్టామని తెలిపిన మంత్రి కేటీఆర్‌ ఈ మార్గంలో 93 మతపరమైన, సమస్యాత్మక కట్టడాలున్న నేప‌థ్యంలో సంబంధిత వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌తో 18 నిర్మాణాలు ప్రభావితం అవుతాయని వారితో సైతం చ‌ర్చిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో భాగంగా, జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ట్రామ్‌, బీఆర్టీఎస్ సేవ‌ల్లో ఏది చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.

 

కాగా, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) మాస్టర్‌ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. వరంగల్‌ నగరంలో 15 కిలోమీటర్ల మేర మోనో రైలుతోపాటు హైదరాబాద్‌ తరహాలో మెట్రోరైలు ప్రతిపాదనలను సిద్ధంచేయాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు.. అధికారులను ఆదేశించారు. 2020-2041 వరకు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌తో వరంగల్‌ మహానగరానికి మహర్దశ పట్టనుందని మంత్రి చెప్పారు. అన్నిరంగాల్లో వరంగల్‌ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేసి, పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. వరంగల్‌కు మంజూరైన 68 కి.మీ. రింగ్‌రోడ్డులో 29 కి.మీ. మేర పనులను మేనెల చివరినాటికి పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: