కరోనా వైరస్ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశం మొత్తంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 73కి చేరుకున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చింది. గురువారం మరో 13 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వారు ప్రకటించారు. వీటిలో 9 మహారాష్ట్ర, ఢిల్లీ, లడఖ్, యూపీలో ఒక్కొక్కటి నమోదయినట్టు సమాచారం. వీరిలో 56 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ మేరకు పార్లమెంట్‌కు గురువారం సమాచారం ఇచ్చారు. 

 

ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణాలు మానాలని, ఒకవేళ అవసరమైతే వాయిదా వేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులు అంత సురక్షితం కాదని అన్నారు. ఈ నెలలో లెక్క ప్రకారం, గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో కేరళలోనే అత్యధికంగా 17 వరకు కేసులు రిజిస్టర్ అయినట్లు భోగట్టా. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.57 లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించామని ఈ సందర్భంగా మంత్రి జయశంకర్ తెలియజేశారు. 

 

తాజాగా ముంబయిలో తొలిసారిగా రెండు కరోనా కేసులు వెలుగు చూసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. దీంతో ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11కి చేరినట్లు అంచనా. పుణెలో 8, ముంబయిలో 2 , నాగ్‌పూర్‌లో ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 9కి చేరినట్లు వార్తలు వస్తున్నాయి... ప్రపంచవ్యాప్తంగా 114దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌, రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం వున్నట్లుగా WHO ప్రకటించింది. 

 

ఇక జనుల భద్రత దృష్ట్యా... భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు వివిధ రకాల పర్యాటక వీసాలన్నీ రద్దు చేసింది. మార్చి 13నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎక్కడికక్కడ ప్రభుత్వం, ఆరోగ్య నిపుణులు, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కరోనా నివారణ మార్గాల కోసం వివిధ రకాలుగా ప్రసారాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు ఒకేచోట గుమిగూడి ఉండకుండా జాగ్రత్త పడాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: