గడచిన మూడు  రోజులుగా తెలుగుదేశంపార్టీకి  ఎనిమిది మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేసేశారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరిపోయారు. ఒక్కసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా టిడిపికి ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు ?  ఎందుకంటే చంద్రబాబునాయుడు తుగ్లక్ చర్యలను తట్టుకోలేకే వాళ్ళంతా పార్టీని వదిలేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీని వదిలేసిన వాళ్ళల్లో  మాజీ మంత్రులు, మాజీ ఎల్ఏలే ఉండటం గమనార్హం.

 

మొన్నటి సాధారణ ఎన్నికల్లో జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బ తిన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండే చంద్రబాబు చేష్టల్లో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ పై బురద చల్లుతు వైసిపికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని వెంటనే జగన్ కు ముడేసేసి పచ్చమీడియాలో విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి చర్యలను పార్టీలోని నేతల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

 

జగన్ పరిపాలనపై  చంద్రబాబు, పచ్చమీడియా రెచ్చిపోతున్నట్లుగా  జనాల్లో వ్యతిరేకత లేదని చాలామంది నేతలు ఎన్నోసార్లు చంద్రబాబుకు చెప్పారు. అయితే వాళ్ళ మాటలను చంద్రబాబు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోగా తమ నియోజకవర్గాల్లో జగన్ వ్యతిరేక ఆందోళనలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. తాము ఆందోళనలు చేసినా జనాల్లో లేని వ్యతిరేకత ఎక్కడి నుండి వస్తుందన్నది చాలామంది నేతల ప్రశ్న. అయితే తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

 

అదే సమయంలో మరికొందరు నేతల్లో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కూడా కోల్పోతున్నారు. దాంతో టిడిపిలో ఉంటే తమకు  భవిష్యత్తు ఉండదన్న ఆందోళనలతోనే మరొకందరు పార్టీ నుండి  బయటకు వచ్చేస్తున్నారు. పనిలో పనిగా మూడు రాజధానులపై చంద్రబాబు వైఖరిని కూడా ఇంకొందరు తప్పు పడుతున్నారు. సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కదిరి బాబురావు, రహ్మన్, పంచకర్ల రమేష్, డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వాళ్ళంతా టిడిపికి వరసబెట్టి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోతున్నారు. ఇంకా కొందరు కీలక నేతలు తొందరలోనే టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. చూద్దాం ఏం జరగబోతోందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: