విశాఖ ఏపీలో అతి పెద్ద సిటీ. పద‌మూడు జిల్లాల ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటి మహానగరం. పైగా ఈ నగరానికి రాజధాని కళను జగన్ తెస్తున్నారు. దాంతో రాచఠీవి అలా వచ్చేసింది. ఈ నేపధ్యంలో విశాఖలోని పాతిక లక్షల మంది జనాభాను ఏలే మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. 

 

దేశంలోకి అన్ని రాష్ట్రాల ప్రజానీకం కలగలసిన విశాఖను మినీ ఇండియాగా పిలుచుకుంటారు. అలాగే ఇక్కడ కాస్మోపాలిటిన్ సిటీ కల్చర్ ఉంటుంది. ఆసియా ఖండంలో విశాఖ సిటీ పేరు తెలియని వారు లేరు. అటువంటి సిటీకి ప్రధమ పౌరుడు ఎలా ఉండాలి, ఏంటి అన్న దాని మీద అధికార వైసీపీ గట్టి కసరత్తే చేస్తోంది.

 

వైసీపీ నుంచి మేయర్ అభ్యర్ధిగా ఎవరు ఉంటారన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. ఇండైరెక్ట్ ఎన్నికలు ఇవి. దాంతో ముందుగా కార్పోరేటర్ గా గెలవాలి. ఆపై మెజారిటీ కార్పోరేటర్లు మేయర్ని ఎన్నుకుంటారు. ఇక జగన్ విశాఖలో ఒకరిని మేయర్ సీటు మీద గట్టి హామీ ఇచ్చారు. ఆయన పదేళ్ళుగా వైసీపీ కోసం అలుపెరగని పోరాటమే చేశారు.

 

గతసారి ఆయన త్రుటిలో ఎమ్మెల్యే సీటుని కూడా వదిలేసుకున్నారు. ఆయనే విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ శ్రీనివాస్. ఆయనకు జగన్ ఇచ్చిన మాట ప్రకారం మేయర్ పదవి దక్కుతుందని అంటున్నారు. అంటే రేపటి రోజున విశాఖలో పాలనా రాజధాని వచ్చి మెగా సిటీగా ఉంటే దానికి  ప్రధమ పౌరుడిగా వంశీ ఉంటారని అంటున్నారు.

 

దాదాపుగా అయిదువేల కోట్ల బడ్జెట్ కలిగిన జీవీ ఎంసీకి కేంద్ర నిధులు కూడా దండీగా వస్తాయి. మంత్రి పదవి కంటే పవర్ ఫుల్ గా ఉండే మేయర్ పోస్ట్ కోసం ఎంతమంది పోటీ పడినా జగన్ ఇచ్చిన మాట ప్రకారం వంశీదే ఆ సీటు అంటున్నారు. అది ఆయనకే రిజర్వ్ అయిపోయిందని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: