స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ కొత్త కొత్త స్కెచ్‌లతో దూసుకెళుతుంది. మెజారిటీ స్థానాలని గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఇదేరకంగా ముందుకెళుతుంది. అయితే టీడీపీ బలంగా ఉన్న కృష్ణా జిల్లాలో సరికొత్త స్కేఛ్ వేసింది. కీలకమైన జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీసీ అస్త్రాన్ని ప్రయోగించారు. మామూలుగా కృష్ణా జెడ్పీ పీఠం రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు.

 

వైసీపీ మాత్రం జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో ఓ బీసీ మహిళని నిలిపారు. పెడన నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఉప్పాల రామ్ ప్రసాద్ తనయుడు రాము భార్య హారికని జెడ్పీ బరిలో నిలిపారు. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పాల పెడన సీటు ఆశించారు. కానీ ఆ స్థానాన్ని జోగి రమేశ్‌కు కేటాయించారు. దీంతో ఉప్పాలకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దు చేయడంతో ఉప్పాలకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబానికి జెడ్పీ పీఠం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

 

కాకపోతే పెడనకు చెందిన ఉప్పాల హారికని గెలిపించే బాధ్యత మంత్రి కొడాలి నాని తీసుకున్నారు. హారికని తన సొంత నియోజకవర్గం గుడివాడలోని గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా పోటీకి దింపారు. అయితే గుడ్లవల్లేరు మండలం మొదట నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. 2014లో కూడా ఈ స్థానం టీడీపీ ఖాతాలోనే పడింది. పైగా ఇప్పుడు టీడీపీ కూడా హారికకు పోటీగా అదే బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ కాగిత వెంకటకృష్ణరావు భార్య కాగిత భానుని బరిలోకి దింపారు.

 

దీంతో గుడ్లవల్లేరు స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానికి గుడ్లవల్లేరు మండలం నుంచి 900 ఓట్లపైనే మెజారిటీ వచ్చింది. ఇక దీని బట్టి చూసుకుంటే జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైసీపీనే గెలిచే అవకాశముంది. హారికని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత కొడాలి నాని తీసుకుని పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: