టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొద్దికాలంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల విష‌యంలో ఆయ‌న త‌న నిర్ణ‌యం వెలువ‌రిస్తూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం నేప‌థ్యంలో సీనియ‌ర్ నేత సురేష్ రెడ్డిపై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. కొద్దికాలంగా ఆయ‌న కేంద్రంగా జ‌రుగుతున్న ప్ర‌చారం సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది.

 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సురేష్ రెడ్డికి ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న నాయకుడిగా పేరుంది. సురేష్ రెడ్డి బాల్కొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి రాగా  అప్పుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పని చేశారు.నిజామాబాద్ జిల్లా నుంచి శాసనసభ స్పీకర్‌ అయిన మొదటివ్యక్తి సురేశ్ రెడ్డి. క్రియాశీల రాజ‌కీయ‌వేత్త అయిన సురేష్ రెడ్డి 1984 నుంచే మండల స్థాయి రాజకీయాల్లో  పనిచేశారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1990 నుంచి 1993 వరకు అసెంబ్లీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 1997లో పీఏసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుంచి 2003 వరకు కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా వ్యవహరించారు. 

 

2009 ఎన్నిక‌ల్లో ఓటమి పాల‌వ‌డం, 2014 ఎన్నిక‌ల్లోనూ అదే ప‌రిస్థితి ఎదుర‌వ‌గా 2018లో టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు ప‌లు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆయ‌న‌కు పార్టీ ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో గత కొద్దికాలంగా సురేష్ రెడ్డి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలలు లేవు. ఇదే స‌మ‌యంలో సురేష్‌రెడ్డి కారు దిగి కమలం కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ నుంచి కూడా సురేష్ రెడ్డికి ఆఫర్ వచ్చిందనే ప్ర‌చారం సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇలా సురేష్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జ‌రుగుతున్న త‌రుణంలో... దానికి ఫుల్‌స్టాప్ పెడుతూ సీఎం కేసీఆర్ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ చాన్సిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: