భార‌త‌దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య 60కి చేరింది. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే, ఇలా కేసుల సంఖ్య పెరుగుతున్న త‌రుణంలో...కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు బ్రిటీష్‌ కాలం నాటి అంటువ్యాధి చట్టం 1897ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 18వ శతాబ్దంలో ప్లేగు వ్యాధిని నియంత్రించేందుకు  బ్రిటీష్‌ పాలకులు చట్టాన్ని రూపొందించారు. ఆ చ‌ట్టాన్నే తాజాగా అమలు చేయ‌నున్నారు. 

 


1897 చ‌ట్టం ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసే నిబంధనలను అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్ష విధిస్తారు. దీంతోపాటుగా విపత్తు నిర్వహణ చట్టం 2005ను కూడా అమలు చేయనున్నట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. ఇదిలాఉండ‌గా,  ఢిల్లీ, రాజస్థాన్‌లో బుధవారం కొత్తగా ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు తెలిపింది. కేరళ, ఉత్తర ప్రదేశ్‌లో 9 చొప్పున, ఢిల్లీలో 5, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌, లడఖ్‌లో రెండేసి, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

 


ఇదిలాఉండ‌గా, చైనాలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. 22 మంది చనిపోగా కొత్తగా 24 కేసులు నమోదు అయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వూహాన్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. మ‌రోవైపు మొత్తంగా 107 దేశాల్లో కేసుల సంఖ్య 1,17,339కి, మృతుల సంఖ్య 4,251కి చేరింది. బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి నదిన్‌ డోరీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించారు. ప్రధాని బోరిస్‌ గతవారం నిర్వహించిన సమావేశంలో డోరిస్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల్లో ఇంకెవరికైనా కరోనా సోకి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 382కు చేరగా ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 631కి చేరింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను ‘మహమ్మారి’గా పేర్కొనవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి ప్ర‌క‌టించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: