మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌ భూ దందా.. అరెస్టుపై ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారం, పార్టీకి ఏం సంబంధం అని సూటిగా ప్రశ్నించారు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

శ్రీధర్ బాబు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్ బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదు.’ అని జగ్గారెడ్డి అన్నారు. 


రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అని, పీసీసీ అధ్యక్షుడు అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి అంత తీస్‌మార్ ఖాన్ కాదు. అంత తీస్ మార్ ఖాన్ అయితే, టీడీపీలో ఉండే ఎందుకు చేసుకోలేడు..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

 

నువ్వు మగాడివే కదా. తీస్ మార్ ఖాన్ కదా. నువ్వు టీడీపీలో ఉండి మగాడివి అని ఎందుకు అనిపించుకోలేదు? నిన్ను అడిగేవారు లేక ఇదంతా చేస్తున్నారా? ఎలా కనపడుతున్నాం’ అని జగ్గారెడ్డి నిలదీశారు. తనకు కూడా సీఎం కావాలని, పీసీసీ అధ్యక్షుడు కావాలని ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సీఎం కావాలని ఉందని, అయితే, అది డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నారు.


ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన మీద కూడా కేసులు పెట్టారని జగ్గారెడ్డి చెప్పారు. అయితే, ఆ విషయాన్ని పార్టీకి చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు రాజనీతిలో మామూలేనన్నారు. అమీన్ పూర్ అసైన్‌మెంట్ భూముల విషయంలో కూడా తాను తెలియక సంతకం పెట్టానన్నారు.

 

తనను కూడా ప్రభుత్వం ఎప్పుడు జైల్లో పెడుతుందో తెలియదన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రచారంతోనే రేవంత్ రెడ్డి కొంపముంచుతున్నారని అనుచరులకు హితవు పలికారు. ప్రభుత్వం మీద పోరాటం, కేసీఆర్‌కు వ్యతిరేక పోరాటం పక్కదారి పట్టి సొంత ఎజెండా ముందుకొచ్చిందన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: