ఆ రెండు దేశాల మధ్య మొన్నటి వరకు వాణిజ్య యుద్ధం నడిచింది..! ఇప్పుడు కరోనా సీజన్ కావడంతో కరోనా వార్ మొదలైంది. ప్రపంచమంతా కరోనాతో వణికిపోతుంటే... ఆ మహమ్మారి వ్యాపించడానికి మీరంటే మీరే కారణమంటూ చైనా.. అమెరికా తిట్టిపోసుకుంటున్నాయి. మేడిన్ చైనా అంటూ అమెరికా చైనాపై విరుచుకుపడుతోంది.

 

అందరినీ భయపెట్టే అమెరికాను ఇప్పుడు కరోనా భయపెడుతోంది. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని అమెరికా ఊహించలేదు. కరోనాను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ కూడా చాలా సార్లు  ప్రకటించారు. అయితే పరిస్థితి తలకిందులైపోయింది. కరోనా కేసులు, మరణాలు ఊహకందని స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం బ్లేమ్ గేమ్ మొదలు పెట్టింది.

 

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో విజృంభించడానికి చైనానే కారణమంటూ ఆరోపిస్తోంది. మేడిన్ చైనా అంటూ అమెరికా ప్రజలకు పదేపదే గుర్తుచేస్తోంది. ప్రపంచమంతా నోవల్ కరోనా వైరస్ అని పిలుస్తుంటే...అమెరికా మాత్రం వుహాన్ కరోనా అని పేరుపెట్టింది. అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా... కరోనాను గుర్తించడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.... మహమ్మారి బయట పడిన తర్వాత కూడా ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శిస్తోంది అమెరికా. 

 

కరోనా విషయంలో చైనా వ్యవహరించిన తీరే ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వ్యాపించడానికి కారణమంటోంది . అయితే అమెరికా ఈ తరహా ఆరోపణలు చేయడానికి మరో కారణం కూడా ఉంది. చైనాను టార్గెట్ చేసుకోవడానికి అమెరికానే కరోనా పేరుతో బయో కెమికల్ ఆయుధాన్ని సృష్టించిందని చైనా ఇటీవల ఆరోపించింది. చైనా అధికారిక మిలటరీ పోర్టల్ దీనిపై ఆర్టికల్ ప్రచురించింది. 

 

అమెరికా ఆరోపణలను చైనా కొట్టిపడేస్తోంది.  కరోనా విషయంలో ఒకరకంగా తాము ప్రపంచానికి చాలా మేలు చేశామని చెబుతోంది. కరోనాను సమగ్రంగా స్టడీ చేసిన తర్వాత కరోనాను ఎదుర్కొనే విషయంలో కొరియా, జపాన్, ఇటలీకి వైద్యపరంగా సాయం చేశామంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: