జేసీ బ్రదర్స్.. అనంతపురం జిల్లాలో బాగా పేరున్న నాయకులు.. ఒకప్పుడు జిల్లాను గడగడలాడించినవారు.. ఇప్పుడు తెలుగు దేశం అధికారం కోల్పోవడంతో పాపం.. కాస్త కళ తప్పారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ ఇద్దరు అన్నదమ్ములూ.. తమ పిల్లలను మొన్నటి ఎన్నికల్లో పోటీకి పెట్టి దెబ్బ తిన్నారు. ఇద్దరూ ఓడిపోవడంతో రాజకీయంగా కాస్త డల్ అయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.

 

 

మరి ఇప్పుడు జేసీ బ్రదర్స్ ఏంచేస్తారో అన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిళ్లో ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం దండగ.. పోటీ చేసి గెలిచినా.. ఏవో కేసులు పెట్టి జగన్ లోపల వేస్తాడు అంటూ ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడటం కలకలం సృష్టించింది. ఇక జేసీ బ్రదర్స్ అస్త్ర సన్యాసం చేసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.

 

 

ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకోకుండా జలక్ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి గురువారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు కార్పోరేటర్ గా పోటీ చేయడం ఏంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా తమ అనుచరులలో ధైర్యం నింపడానికే కావచ్చన్న టాక్ వినిపిస్తోంది.

 

 

అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ నామినేషన్ వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయన తన అనుచరులతో కూడా రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయించారు. మరోవాదన ఏంటంటే.. టీడీపీకి అభ్యర్థులు దొరక్క.. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డే బరిలో దిగుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకే జేసీ సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: