సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా జనసేన ఉంటుందని, తమకు అధికారం లేకపోయినా కొన్ని రకాల సిద్ధాంతాలతో ముందుకు వెళ్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యం అని, తమకు అధికారం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు, మాకు కులాలు, మతలు లేవని ఇలా ఎన్నెన్నో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇప్పుడు.. అప్పుడు... ఎప్పుడూ జనసేన లో అటువంటి వ్యవహారం కనపడలేదు. 2014 లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి జనసేన మద్దతు పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఎన్నికల ప్రచారం కూడా ఆ పార్టీ అభ్యర్థుల తరపున నిర్వహించి ఆ పార్టీలు విజయంలో భాగస్వామి అయ్యారు. 


ఇక ఆ తర్వాత కొన్ని విభేదాలతో ఆ రెండు పార్టీలకు పవన్ కాస్త దూరం జరిగారు. అంతేకాకుండా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పైన విమర్శలు చేశారు. టిడిపి, బీజేపీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానంటూ వామపక్ష పార్టీలను కలుపుకుని పవన్ ముందుకు నడిచారు. కానీ కొద్ది రోజులకి వామపక్ష పార్టీలను బాగా దూరం పెట్టారు. ప్రస్తుతం బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇవన్నీ జనసేన పార్టీలో నెలకొన్న గందరగోళానికి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో పార్టీతో కలిసి పోటీ పొట్టుకుంటున్నారు జనసైనికులు.


రాష్ట్రవ్యాప్తంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే జనసేన పార్టీ నాయకులు టిడిపితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థులు బరిలో ఉన్నా.. వారిని ఓడించడమే లక్ష్యంగా టిడిపి, జనసేనలు ముందుకు వెళ్తున్నాయి. వామపక్ష పార్టీలు బలంగా ఉన్న విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం పార్టీల తో కలిసి పోటీ చేసేందుకు స్థానిక జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. 


ఇలా ఎవరికి వారు తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. అసలు జనసేన పార్టీ విధానం ఏమిటి అనేది కూడా ఎవరికీ అర్థం కాకుండా గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అది నాయకుడి నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ఇదే తంతు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: