మాచర్లలో బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్తున్న కారుపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ టీడీపీ గగ్గోలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇది వైసీపీకి బాగా బ్యాడ్ నేమ్ తెస్తుందన్న కారణంతో వైసీపీ కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. అసలు ఆ కారుపై వైసీపీ నాయకులు దాడి చేయలేదని.. ఓ వికలాంగుడిని ఢీకొట్టి వెళ్తుంటే స్థానికులే తిరగబడి దాడి చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు.

 

 

కానీ ఆ ప్రచారం నమ్మతగ్గట్టుగా లేనే లేదు. దీనికి తగ్గట్టుగానే... వెంటనే టీడీపీ శ్రేణులు ఆ ప్రమాదం ఫోటో ఫేక్ అనీ... అది 2017లో జరిగిన ఓ ప్రమాద ఘటన అనీ పాత ఫేస్‌బుక్ ఫోటోతో వైసీపీ ప్రచారాన్ని కౌంటర్ చేశారు... అందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు. కానీ వైసీపీ నాయకులు చెప్పిందే నిజమైతే.. ఆ పిల్లవాడు ఎవరు..? ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది..? ఆ పిల్లవాడిని ఏ హాస్పిటల్‌లో చేర్చారు..? ఆ పిల్లవాడి తల్లిదండ్రులో, బంధువులో ఎవరితోనైనా మాట్లాడి మీడియా ముందుకు తీసుకొస్తే బావుండేది.

 

 

కానీ అలాంటిదేమీ జరగలేదు. అంటే.. వైసీపీ నాయకులు చెప్పిందంతా కట్టుకథేనా.. మాచర్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దృష్ట్యా టీడీపీ అనుకూల పత్రికలు ఈ విషయాన్ని ఎలాగూ హైలెట్ చేస్తాయి. మరి అలాంటప్పుడు అధికార పార్టీ పత్రికగా సాక్షి కూడా దీన్ని గట్టిగా ఎదుర్కోలేకపోయింది. బోండా ఉమ కారు ఢీకొట్టిన బాధితుడి తాలూకూ వివరాలతో వార్త ఇవ్వలేకపోయింది. ఇక్కడ సాక్షి కూడా టీడీపీ వాహనం ఢీకొని ఓ దివ్యాంగ బాలుడు గాయపడినట్టుగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోనే పెట్టారు …

 

 

దీన్ని బట్టి చూస్తే.. వైసీపీ వాదన అంత నమ్మ శక్యంగా లేదు. పోనీ ఆ తర్వాతైనా వైసీపీ నాయకులు నష్ట నివారణ చర్యలు చేపట్టారా.. లేదు. అంతే కాక.. గతంలో టీడీపీ ఇలా చాలా సార్లు చేసిందన్న కోణంలోనే మాట్లాడారు. గతంలో పిన్నెల్లి కారుపై దాడి ఘటన, అసలు ఆ నాయకులు మాచర్లకు ఎందుకొచ్చారు..? 10 కార్లలో ఎందుకొచ్చారు.. వంటి ప్రశ్నలతో ఎదురు దాడి చేయడం అధికార పార్టీకి నష్టమే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: