వినటానికే విచిత్రంగా ఉన్న ఈ లాజిక్ ను చంద్రబాబునాయుడు పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ తరపున గెలవటానికి అవకాశం లేకపోయినా సరే రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను పోటి చేయించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఒక్కో అభ్యర్ధికి 35 ఓట్లు రావాలి. వైసిపికి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి కాబట్టి గెలుపు చాలా సులభం. మరి టిడిపి విషయం చూస్తే ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు. వీళ్ళల్లో కూడా ఎంత మంది ఓట్లేస్తారో సందేహమే. ఇటువంటి పరిస్ధితుల్లో పార్టీ తరపున పోటి చేయించటమన్నది కేవలం తుగ్లక్ నిర్ణయం  తప్ప మరోటి కాదు.

 

ఎవరేమనుకున్నా సరే ఎస్సీ నేత వర్లను పోటిలోకి దింపాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు ? ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పిన కారణమే విచిత్రంగా ఉంది. అదేమిటయ్యా అంటే వైసిపి గెలుచుకునే నాలుగు సీట్లలో ఒక్కటి కూడా ఎస్సీలకు కేటాయించలేదట. పైగా ఒకస్ధానాన్ని ముఖేష్ అంబానీ అడిగాడని పరిమళ్ ధీరజ్ నత్వానికి ఎలా ఇస్తారంటూ అడగటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసిపికి వచ్చే స్ధానాలను ఎవరికి ఇవ్వాలన్నది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇష్టమే.

 

సొంతంగానే నిర్ణయం తీసుకుంటాడో లేకపోతే పార్టీలోని ముఖ్యులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాడో అది జగన్ , వైసిపి అంతర్గత విషయమని చంద్రబాబుకు తెలీదా ? వైసిపి తరపున ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చంద్రబాబు జోక్యమెందుకు ?  తన హయాంలో కూడా సురేష్ ప్రభు, నిర్మల సీతారామన్ ను చంద్రబాబు టిడిపి కోటాలో రాజ్యసభ ఎంపిలను చేయలేదా ? అపుడేమన్నా జగన్ జోక్యం చేసుకున్నాడా ?

 

ప్రతి విషయంలోను జగన్ పై బురద చల్లాలని ప్రయత్నిస్తే చివరకు తనమీదే పడుతుందన్న కనీస ఇంగితం కూడా చంద్రబాబులో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. వైసిపి తరపున ఒక్క ఎస్సీని కూడా రాజ్యసభ ఎంపిగా ప్రకటించలేదని గెలుపు అవకాశం లేకపోయినా తమ తరపున ఓ ఎస్సీని పోటికి దింపుతున్నట్లు ప్రకటన చేయటం కేవలం తుగ్లక్ చర్య అనిపించుకుంటుందే కానీ వ్యూహాత్మకమని అనిపించుకోదు. ఇటువంటి మతిలేని మాటలు, చేష్టలు చేస్తున్నాడనే సీనియర్లందరూ పార్టీని వదిలేస్తున్నారేమో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: