కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర యువనేత మాధవ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ అధికారికంగా మాధవ్ ను ఎంపిక చేసినట్లు ప్రకటన చేయనుందని తెలుస్తోంది. బీజేపీ వర్గాలు ఎన్నికలు ముగియగానే ఏ క్షణమైనా మాధవ్ పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. 
 
ఏపీ బీజేపీ రాష్ట్ర సారథిగా మాధవ్ ను ఎంపిక చేయడం ఒక రకంగా వైసీపీకి షాక్ అనే చెప్పాలి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి జగన్ తీసుకున్న నిర్ణయాలను మాధవ్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. టీడీపీతో సన్నిహితంగా మెలిగే మాధవ్ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం వైసీపీకి కొంత ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. మొదటి నుండి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మాధవ్ తప్పుబడుతూ వచ్చారు. 
 
విశాఖను రాజధాని చేయడం రాజకీయ కుట్ర అని మాధవ్ విమర్శలు చేశారు. శాసనమండలి రద్దును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం రాజధాని కోసం రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఏపీలో శాసనమండలి రద్దు దురదృష్టకరమని, రద్దు ఏకపక్ష నిర్ణయమని వ్యాఖ్యలు చేశారు. సింహాచలం దేవస్థానం చైర్మన్ ను మారుస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దారుణమని విమర్శలు చేశారు. 
 
వైసీపీ దేవాదాయ భూములపై కన్నేసిందని ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కూల్చడం సరైన నిర్ణయం కాదని వైసీపీపై విమర్శలు చేశారు. జగన్ గత ప్రభుత్వం చేసిన తప్పునే పునరావృతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. వైసీపీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: