నీటిలో దిగే, ఎగిరే విమానాలను (సీ ప్లేన్‌లు) అంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే. గుజరాత్‌  పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ...తొలిసారి సీ ప్లేన్‌లో ప్రయాణం చేశారు. సబర్మతి నది నుంచి సీప్లేన్‌ ద్వారా ధారోయ్‌ డ్యామ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దీంతో గ‌త కొద్దికాలంగా సీప్లేన్ ప్ర‌యాణం పాపుల‌ర్ అయింది. అయితే, త్వ‌ర‌లో ఇలాంటి సీప్లేన్‌లు మ‌న హైద‌రాబాద్‌లో త‌యారు కానున్నాయి.

 

విమానాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉద్దేశించిన వింగ్స్‌ఇండియా ఎయిర్‌షో-2020 గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. వింగ్స్‌ ఇం డియా  ఎయిర్‌షో-2020కి విచ్చేసిన స్వీడన్‌కు చెందిన రెవిన్‌ ఏవియేషన్‌ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్‌ నిల్స్‌ పిల్‌బ్లాడ్ ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లో సీప్లేన్‌ (సముద్రపు విమానం) డిజైన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్ర‌క‌టించారు.ఇప్ప‌టివ‌ర‌కు తాము ఇద్దరు పైలట్లు, 10మంది ప్రయాణికులు కూర్చునే విధంగా తాము విమానాలను రూపొందించామని తెలిపారు. విమానాశ్రయాల ఏర్పాటుకు భూమి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో సీప్లేన్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుందని ఆయ‌న వివ‌రించారు. దీనిపై పదేళ్ల‌పాటు అధ్యయనం చేశామని చెప్పారు. సీప్లేన్‌లను ఎయిర్‌ అంబులెన్స్‌లుగా కూడా వినియోగించవచ్చని నిల్స్ అన్నారు. 2013 లో స్లీప్లేన్‌లను కొనుగోలు చేసిన కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే పర్యాటకులను అలరిస్తోందని చెప్పారు. 

 

ఇదిలాఉండ‌గా, గ‌తంలో సీప్లేన్ ర‌వాణాను విస్తృతం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. ఎందుకంటే... మామూలు విమానాలకు ఎయిర్‌పోర్టు కట్టాలంటే భారీ స్థాయిలో స్థలం, బోలెడు డబ్బు అవసరం. కానీ సీప్లేన్‌ల‌కు అలాంటి అవ‌స‌రం లేదు. నీటి ఏరోడ్రోమ్‌లకు పెద్దపెద్ద చెరువులు లేదా నదుల వంటి నీటి వనరులు సరిపోతాయి. మూరుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నీటి ఏరోడ్రోమ్‌లకు అనుమతి మంజూరు చేసింది. తొలిదశలో ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, అసోంలలో నీటి ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అప్ప‌టి కేంద్ర విమానయాన శాఖమంత్రి సురేశ్ ప్రభు ఈ విష‌యం వెల్లడించారు. ఈ విమానాలతో టూరిజం వృద్ధి చెందుతుందని, పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సులభమవుతాయని ఆయన పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: