అదనపు కట్నం కోసం వేధింపులపై ఎన్నారై అల్లుళ్లకు సంబంధించిన నిత్యం అనేక కేసులు నమోదవుతున్నాయి. భార్యలను వేధింపులకు గురిచేసి ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఎన్నారై అల్లుళ్ల ఆటలు సాగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వరకట్నం వేధింపుల కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్లకు’ పోలీసులు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

 

ఎన్నైరై భర్తలు వివాహం చేసుకుని తీసుకెళ్లట్లేదని.. అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని.. లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు ఎన్నారైలను అరెస్టు చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

భారత్ లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనేది తీవ్రమైన నేరం కాదు. దీంతో ఇంటర్పోల్ ఎన్నారైలకు రెడ్ కార్నర్ నోటీసులకు బదులుగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంది. ఇది కేవలం నిందితులకు సంబంధించిన ఆచూకీ తెలిపేందుకే మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ. ఇది వాంటెడ్ ఎన్నారైలకు అనుకూలంగా మారింది.

 

ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్గా ఉన్న ఎన్ఆర్ఐ అల్లుళ్లపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. దీనిని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు పంపిస్తారు. ఎల్ఓసీ జారైన వ్యక్తి వ్యక్తిగత కేసు వివరాలు పాస్పోర్ట్ నంబర్లను విమానాశ్రయాల్లో ఉండే డేటాబేస్లో నిక్షిప్తం చేస్తారు. ప్యాసింజర్ ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో వాంటెడ్ అని వెలుగులోకి తేలితే అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇస్తారు.

 

సంబంధిత పోలీసులు అక్కడి చేరుకొని నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్పోర్ట్ దాటకుండా తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అలాగే పాస్ పోర్టు చట్టం ప్రకారం న్యాయస్థానాలకు వాంటెడ్గా ఉండి విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తి పాస్పోర్ట్ను రద్దు చేయించే అధికారం పోలీసులకు ఉందని సమాచారం.

 

అదే జరిగితే సదరు వ్యక్తి ఉద్యోగం కోల్పోవడంతోపాటు స్వదేశానికి డిపోర్ట్ కావడం తిరిగి విదేశాలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నారైలు కాళ్లబేరాలకు వస్తున్నారు. భార్యల తో రాజీలు చేసుకోవడమో కోర్టులకు హాజరై ఎన్బీడబ్ల్యూలు రీకాల్ చేయించుకోవడమో చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 40మందిపై ఈ చర్యలు తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: