ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కరోనా భారీన ప్రజలు పడకుండా చేపట్టాల్సిన చర్యలు, కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావం, ఇప్పటివరకూ తీసుకున్న చర్యల గురించి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కరోనా గురించి కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 75 నమోదయ్యాయి. పలు ప్రాంతాలలో కరోనా అనుమానితుల రిపోర్టులు వైద్యులకు అందాల్సి ఉంది. ఈ సమావేశంలో విదేశీయులపై ఆంక్షలు విధించటంతో పాటు ఎయిర్ పోర్టులలో స్క్రీనింగ్ అనంతరం మాత్రమే ప్రయాణికులను అనుమతించేలా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 
 
భారత్ స్టాక్ మార్కెట్ పతనం, కరోనా తొలి మరణం, పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మోదీ కార్యాలయం నుంచి అందుబాటులో ఉన్న మంత్రులందరూ ఢిల్లీకి రావాలని సమాచారం అందింది. కరోనాతో పాటు ఈ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
మోదీ మంత్రులతో కరోనా అనుమానితులు సంచరించిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం. కాగా తాజాగా భారత్ లో తొలి కరోనా మరణం నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కర్ణాటకలోని కలబురిగిలో చనిపోయిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనాతో చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల కొరకు అతడి బ్లడ్ శాంపిల్స్ ను పూణెలోని ల్యాబ్ కు పంపగా కరోనా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: