గ్లామ‌ర్ + గ్రామ‌ర్ అంటూ పొత్తు పెట్టుకున్న బీజేపీ, జ‌న‌సేన సీన్ ఏపీలో లేద‌ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రుజువు చేస్తున్నాయి. గ‌తేడాది ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాయి. జ‌న‌సేన అధినేత రెండు చోట్లా ఓడిపోగా ఆ పార్టీ రాజోలులో మాత్ర‌మే గెలిచింది. ఇక బీజేపీకి ఒక్క చోటా కూడా డిపాజిట్ రాలేదు. పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, పైడి కొండ‌ల మాణిక్యాల‌రావు లాంటి వాళ్ల‌కే దిక్కూ దివాణం లేదు. వాళ్లే ఎంపీలుగా పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల కూట‌మి చివ‌ర‌కు నామినేష‌న్లు వేసేందుకు కూడా అభ్య‌ర్థులు లేక చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ జిల్లాలో ఎన్నిక‌ల‌కు ముందే ఈ కూట‌మి చ‌తికిల ప‌డింది. విశాఖ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ ఘట్టం ముగిసేసరికి  సగానికి పైగా స్థానాల్లో ఈ రెండు పార్టీలకు అసలు ఎంట్రీయే లేదు. ఇక జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు అయిన  భీమిలీ, సబ్బవరం, పెందుర్తి వంటి చోట్ల నామినేష‌న్లే వేయ‌లేదు.

 

ఇక ఏజెన్సీలో అస‌లు ఎందుకు నామినేష‌న్ల ఖ‌ర్చులు దండ‌గ అన్న‌ట్టుగా రెండు పార్టీలు వ్య‌వ‌హ‌రించాయి. మొత్తం జిల్లాలో ఉన్న 651 ఎంపీటీసీ స్థానాల‌కు రెండు పార్టీలు కేవ‌లం 367 స్థానాల్లో మాత్ర‌మే నామినేష‌న్లు వేశాయి. మ‌రి వీరిలో రేపు ఉప‌సంహ‌ర‌ణ పూర్త‌య్యే స‌రికి ఎంత‌మంది రేసులో ఉంటారో ?  చూడాలి. ఇక ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కూట‌మి ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా ఉంది. ఇక గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండు పార్టీల త‌ర‌పున పోటీ చేసేందుకు కూడా ఆస‌క్తి చూప‌డం లేదంటే కూట‌మి ఎలా చేతులు ఎత్తేసిందో అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: