ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తోంది. ఈ వార్తలతో టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే శబరిమల దేవస్థానం అయ్యప్ప స్వామి దర్శనార్థం ఈ నెలలో భక్తులు రావద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఇక...నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే తిరుమలలో కూడా టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశీ పర్యటన నుంచి భారతదేశానికి విచ్చేసిన భక్తులు 28 రోజుల తరువాతే తిరుమల పర్యటనకి రావాలని సూచిస్తోంది టీటీడీ.

 

కలియుగ వైకుంఠం తిరుమలలో కరోనా వైరస్‌పై అలర్ట్ అయ్యింది టిటిడి. ఇప్పటికే 109 దేశాలలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ సులభంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. తిరుమలకు భక్తులు చేరుకున్నప్పటి నుంచి జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోనే సంచరించాల్సి ఉంటుంది. 

 

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు రెండు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది టీటీడీ. కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు తిరుమలకు రాకుండా నివారించే ప్రయత్నాలు చేస్తోంది. తిరుమలలో కరోనా వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటోంది. జర్వం,జలుబు,దగ్గు ఉన్న భక్తులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది టీటీడీ.

 

అలిపిరి వద్ద థర్మో స్క్రీనింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అనుమానం కలిగిన భక్తులను పరిశీలించిన తర్వాతే తిరుమలకు అనుమతించాలని భావిస్తోంది టిటిడి. విదేశాల నుంచి వచ్చే వారు భారతదేశంలోకి అడుగు పెట్టి 28 రోజులు పూర్తయిన తరువాతే తిరుమల పర్యటనకి రావాలని విజ్ఞప్తి చేస్తోంది.

 

మరోవైపు...కరోనా వైరస్ కారణంగా భక్తులు తిరుమల పర్యటన వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి వారి సౌలభ్యం కోసం దర్శన టిక్కెట్లను రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వషన్ ద్వారా దర్శన టిక్కెట్లు పొందిన భక్తులు వాటిని రద్దు చేసుకున్నా తిరిగి నగదు చెల్లించే విధానం టిటిడిలో లేదు. కరోనా వైరస్ కారణంగా విదేశాల నుంచే వచ్చే భక్తులు అనారోగ్యంతో బాధ పడే భక్తులను టిటిడియే పర్యటన వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. ఇలాంటి తరుణంలో టిక్కెట్లు రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి నగదును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తులు సంచరించే ప్రాంతాల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటు వ్యాధుల నివారణ మందులతో శుభ్రం చేస్తోంది. 

 

మరోవైపు తిరుమల క్షేత్రం కర్మభూమి అని...వైరస్ వ్యాపించే అవకాశం ఉండదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తిరుమలకు చేరుకుంటున్న భక్తుల్లో స్వల్ప సంఖ్యలోనే మాస్కులు ధరిస్తున్నారు. గతంలో స్వైన్ల్ ప్లూ వచ్చిన సమయంలో కూడా తిరుమలలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంధర్భంగా లక్షలాది మంది తరలివచ్చిన సమయంలోనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అభిప్రాయపడుతున్నారు భక్తులు. 

 

ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు సంఖ్యలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎన్నారై భక్తులు సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గతంలో నిత్యం 4 వందల మంది వరకు ఎన్నారై భక్తులు తిరుమలకు వచ్చే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 2 వందలకు తగ్గిపోయింది. ఇక టిటిడి తిరుమలలో భక్తులు సౌకర్యార్దం ప్రత్యేక ఐసొలేషన్ వార్డుని ఏర్పాటు చేసింది. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని వెంటనే తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించేలా ఏర్పాట్లు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: