స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందే అధికార వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. మాచర్ల నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 ఎం‌పి‌టి‌సి స్థానాలు ఉండగా, 60 సీట్లని ఏకగ్రీవంగా సొంతం చేసుకోనుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయలేక చేతులెత్తేశారు.

 

ఈ క్రమంలోనే మాచర్ల మున్సిపాలిటీలో కూడా టీడీపీ చేతులెత్తేసింది. మొత్తం 31 స్థానాల్లో  26 చోట్ల కేవలం వైసీపీ అభ్యర్థులే నామినేషన్ వేశారు. దీంతో మాచర్ల వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక 5 చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్ వేశారు. ఈ ఐదు స్థానాల్లో వైసీపీ-టీడీపీ అభ్యర్థులు పోటీ పడనున్నారు. మొత్తానికైతే మాచర్ల వైసీపీ ఖాతాలోకి వచ్చేసింది.

 

ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైసీపీ యువజన విభాగం నాయకుడు తురకా కిశోర్.. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. తురకా కిశోర్ తరఫున ఆయన అనుచరుడు మహంకాళి కన్నారావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే మాచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ రేసులో తురకా కిశోర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలపై దాడి చేసే కంటే ముందే ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.

 

  • పిన్నెల్లి ప్రధాన అనుచరుడుగా ఉన్న తురకా కిశోర్‌కు... స్థానికంగా మంచి పట్టు ఉందని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన.. వంటి అంశాలపై అవగాహన ఉందని అక్కడి వైసీపీ కేడర్ చెబుతోంది. అలాగే రాజకీయంగా ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొన గలిగే సత్తా ఉందని అంటున్నారు. ఇక దీని బట్టి చూసుకుంటే కిశోర్‌కు మాచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: