చంద్రబాబునాయుడు రాజకీయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఏదో ఆలోచిస్తారు, ఏదో చేస్తారు, చివరకు ఇంకేదో అవుతుంది. హోలు మొత్తం మీద పార్టీకి తీరని దెబ్బ పడుతుంది.  బద్ధ శతృవులైన వాళ్ళని ఏకం చేద్దామని చేసిన ప్రయత్నం చివరకు పార్టీని జిల్లాలో పుట్టి ముంచేసిందనే చెప్పాలి. ఆచరణ సాధ్యంకాని ప్రయోగాలు చేసి చివరకు పార్టీకే చేటు తెచ్చాడు చంద్రబాబు. వికటించిన ప్రయోగం ఫలితాన్ని పార్టీ ఇపుడు అనుభవిస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు కడప జిల్లాలోని జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి దశాబ్దాలుగా విధేయునిగా ఉంటున్నారు. వైఎస్సార్ కుటుంబంతో రామసుబ్బారెడ్డి కుటుంబానికి ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే పార్టీ పదేళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నా మాజీమంత్రి మాత్రం టిడిపిని వదలకుండా క్యాడర్ చెక్కు చెదరకుండా అట్టేపెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ తరపున తర్వాత వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి కుటుంబంతో నియోజకవర్గంలో పోరాటాలు చేశాడు. 

 

సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ధ్యేయంతో ఆదినారాయణరెడ్డిని మంత్రిపదవి ఆశచూపించి పార్టీలోకి లాక్కున్నాడు చంద్రబాబు. ఆది రాకను రామసుబ్బ తీవ్రంగా వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో చేసేది లేక మాట్లాడకుండా కూర్చున్నారు. నిజానికి వీళ్ళద్దరి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పు లాంటిదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఇద్దరు నేతలను ఏకం చేద్దామని చంద్రబాబు అనుకున్నాడు.

 

సరే ఏదో ఆర్ధిక విషయాల్లో ఇద్దరు కలిసినా రాజకీయంగా మాత్రం ఎవరి దారిలోనే వాళ్ళు వెళ్ళారు. చివరకు ఇద్దరి మధ్య ఏదో రాజీ చేసి ఆదిని కడప ఎంపిగా రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎంఎల్ఏగా చంద్రబాబు పోటి చేయించాడు. సరే ఇద్దరూ ఓడిపోయారు లేండి. తర్వాత ఏమైంది ? ఇపుడు ఇద్దరూ టిడిపిని వదిలేశారు. ఆది చాలా కాలం క్రితమే బిజెపిలో చేరిపోతే తాజాగా రామసుబ్బారెడ్డి వైసిపి కండువా కప్పుకున్నాడు. అంటే ఇద్దరు కూడా చంద్రబాబును నిండా ముంచేసినట్లే అనుకోవాలి. ప్రతి జిల్లాను ఇలాంటి పనికిమాలిన ప్రయోగాలు చేయటం వల్లే ఇపుడు పార్టీ పరిస్ధితి దయనీయంగా తయారైంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: