దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం చెప్పిందే వేదం. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. గత 30 ఏళ్లుగా వారిదే అక్కడ రాజ్యం.  అలాంటి రాజకీయ చరిత్రకు ఇప్పుడు చెదలు పట్టాయ్. లోకల్ రాజకీయాలు, ఫ్యామిలీ పాలిటిక్స్‌తో ఇప్పుడు స్థానిక సమరంలో బరిలోకి దిగేందుకు అభ్యర్దులు లేని దుస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఆ నాయకుడి ఇలాఖాలో పార్టీ "కళ" తప్పడానికి కారణాలేంటి..? 

 

సిక్కోలులో స్థానిక సమరం రాజుకుంది . నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్ధులు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లా అంతటా ఎన్నికల వాతావరణం ఉన్నా..ఏపీ టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ సొంత ఇలాఖాలో మాత్రం తమ్ముళ్లకు ఇబ్బందులు తప్పలేదు. అందుకు కారణం  రాజాం నియోజకవర్గంలోని కళావెంకట్రావ్‌కు గట్టిపట్టున్న రేగిడి ఆముదాలవలస మండలంలో  మూడు ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయ్. ఇప్పుడు జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 

 

శ్రీకాకుళం జిల్లా  తెలుగు దేశం పార్టీకి కంచుకోట. కానీ ఇదంతా గతం ... ఇప్పుడు జిల్లాలో సైకిల్ పార్టీ పట్టు జారిపోతోంది. ముఖ్యంగా కళావెంకట్రావ్‌కు  కంచుకోటైన రేగిడి ఆమదాలవలస మండలంలో టీడీపీ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది.గతంలో రాజాం, వంగర, రేగిడి ఆముదాలవలస, విజయనగరం జిల్లాకు చెందిన బలిజిపేట కలిసి ఉణుకూరు నియోజకకర్గంగా ఉండేది.  1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. కళావెంకట్రావ్ 1983లో ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలిచారు. ఆ తర్వాత 1985, 89, 2004 ఎన్నికల్లో ఉణుకూరు నుంచే కళా గెలిచారు. 2009 పునర్విభజనతో రాజాం నియోజకవర్గంగా ఏర్పడింది. పునర్విభజనతో అప్పటి వరకూ జనరల్‌గా ఉండే ఆ నియోజకవర్గం ... ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ కి కేటాయించడంతో " కళా " మకాం అక్కడికి మారింది.

 

కళా స్వగ్రామం రేగిడి కూడా రాజాం పరిధిలోనే ఉండటంతో  ఆయన హవా కొనసాగేది.  ఆముదాల వలస మండలం నిన్న మొన్నటి వరకూ కళా కోటలోనే భద్రంగా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా..తమ కనుసన్నల్లో ఉండేవారికే సీట్లు, పదవులు ఇస్తూ తమ పట్టును కొనసాగించారు. అయితే 2019 ఎన్నికల దగ్గర నుంచి ఇక్కడ కళా కుటంబం ప్రాభవం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. కళా వెంకట్రావ్‌కు తన కుటుంబం నుంచే రాజకీయంగా ఎదురు గాలి వీస్తోంది.  ఆయన సోదరడు నీలం నాయుడు కుమారుడు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో మండలంలో ఆయన మంచి స్పీడ్ మీద ఉన్నారు. 

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో రేగిడి ఆముదాల వలస మండలంలో 20 ఎంపీటీసీలు ఉంటే అందులో కొమెర, ఖండ్యాం, కందిశ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయ్‌. టీడీపీకి కంచుకోటైన ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ వేసేందుకు ఏ ఒక్క తెలుగుతమ్ముడూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఇదే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత ఇలాఖాలో బరిలోకి దిగేందుకు అభ్యర్దులు ఎవరూ ముందుకు రాకపోవడం పైనే అందరి దృష్టి నెలకొంది. దీంతో కళ కోటకు బీటలు వారాయంటూ రాజకీయ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. రాష్ట్రమంతా పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు తన కంచుకోటలో ఢీలా పడటం తెలుగు తమ్ముళ్లుకు మింగుడుపడటం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: