ప్రపంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్లుగా దీనిపై విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇందులోకి భార‌త్‌ను సైతం లాగిన సంగ‌తి తెలిసిందే. ‘కరోనాను భారత్‌లో పుట్టించనందుకు దేవుడికి ధన్యవాదాలు’ అంటూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నీల్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేయ‌డం మ‌రువ‌క‌ముందే, ఈ వైరస్ కల్లోలంపై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కోవిడ్-19 వైరస్‌ను అమెరికా వూహాన్ వైరస్ అని పదేపదే చైనాయే మూలమన్నట్టు ప్రకటనలు చేస్తోంది. అయితే, కరోనా జన్మస్థలం వూహాన్ కాదని, అమెరికా సైన్యం వూహాన్‌పై కోవిడ్-19ను ప్రయోగించిందని చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 


ప్రస్తుతం చైనాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఇతర దేశాల్లో వైరస్ సరవేగంగా విజృంభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందిస్తూ, గత శీతాకాలంలో అమెరికాలో 3.4 కోట్లమందికి ఇన్‌ఫ్లూయంజా సోకగా వారిలో 20 వేలమంది మృత్యువాత పడ్డారు. అయితే అందులో కొన్ని కోవిడ్-19 కేసులు లేకపోలేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ప్రతినిధుల సభ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అంద‌రి చూపు చైనాపై ప‌డింది.  దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి జావ్ లిజియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మృతులు ఎందరుంటారో చెప్పగలరా? అని ఆయన ప్రశ్నలు సంధించారు. అమెరికా సైన్యం ఈ మహమ్మారిని వూహాన్ లో ప్రవేశపెట్టి ఉంటుందని సందేహం  వ్యక్తం చేశారు. 

 

 గత నెల నుంచి చైనా వూహాన్ వైరస్ జన్మస్థలం కాదనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. చైనాలో మొదట కనిపించింది కానీ చైనాలోనే పుట్టి ఉండకపోవచ్చని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సభ్యుడు జోంగ్ నాన్షాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు చైనాలో మొదలైన మహమ్మారి అనే మాటలతో మొదలుపెట్టిన టీవీ ప్రసంగం చైనాకు కోపం తెప్పించిందని విదేశాంగ ప్రతినిధి ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విష‌యంలోకి ఎంట్రీ ఇచ్చింది. వైరస్ వ్యవహారంలో జాతివివక్ష ఆరోపణలకు తావు ఇవ్వరాదని కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: