ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. డంపులు ఏర్పాటు చేసుకొని మరీ ఇసుక దందాకు పాల్పడుతోంది. అక్రమంగా ఇసుకను అమ్మి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు ఇసుకాసురులు. వందల సంఖ్యలో వాహనాలు పట్టుబడుతున్నా అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొరతను ఆసరాగా చేసుకొని లారీ ఇసుకను లక్షకు పైగానే అమ్ముతున్నారు. ఇసుక మాఫియాకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రకృతి వనరులను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. జిల్లాలో అపారమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు బ్యారేజీలు నిర్మించగా...సర్కారుకు సిరులు కురిపించే ఇసుక ఆ నీటిలో కలిసిపోయింది. బ్యారేజీల్లో నీటి నిల్వలతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. వేల కోట్ల విలువ చేసే ఇసుక సంపద నీట మునిగిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన ఇసుక మాఫియా పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టింది. ఇప్పటికే చాలా చోట్ల డంప్‌ చేసుకున్న ఇసుకను బయటికి తీసి ధరను అమాంతం పెంచేశారు. 

 

ఇక...కరీంనగర్ జిల్లా నుంచి దూర ప్రాంతాలకు రోజు వందలాది వాహనాల్లో అక్రమంగా ఇసుక రవాణా అవుతోంది. హైదరాబాద్‌కు సైతం ఇసుకను ఇక్కడి నుంచే ఇసుకను తరలిస్తున్నారు. లారీ ఇసుక ధర గతంలో 60 వేల వరకు ఉండేది. ప్రస్తుతం 80 వేల నుంచి లక్షా 20 వేల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు అక్రమార్కులు. ఇసుక దందాకు స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసినా ఇసుక అక్రమ రవాణా మాత్రం సాగిపోతూనే ఉంది.

 

మరోవైపు...కొరతను గమనించిన ప్రభుత్వం బ్యారేజీల్లో నీటిని ఖాళీ చేసి ఇసుకను తవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం వద్ద బ్యారేజీలు నిర్మించింది. మేడిగడ్డ వద్ద 34 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించింది. నిర్మాణ సమయంలో 2016లోనే గోదావరిలో పూడికను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కింద 25 రీచ్‌లను గుర్తించారు. వీటిలో 23 రీచ్‌లు అప్పటి నుంచే పని చేస్తున్నాయి. తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: