ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌న‌సాగుతోంది. 125 దేశాల్లో వైరస్‌ కాటుకు దాదాపు 5వేల మంది మృతి చెందగా బాధితుల సంఖ్య 1,34,679కు చేరింది. చైనాలో కరోనా పాజిటీవ్‌ కేసులు తగ్గుతుంటే..ఇటలీ, ఇరాన్‌లో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో, నమస్కారమే కరోనా కాటుకు విరుగుడంటున్నారు. ఔనండి... ఇప్పుడు ప్రపంచమంతా షేక్‌ హ్యాండ్‌ మానేసి సంస్కారంగా నమస్కారం చేస్తున్నారు. ఎదుటి వారిని పలకరించేందుకు భారతీయ సంస్కృతికి జై కొడుతున్నారు. పలువురు దేశాధినేతలు కూడా నమస్తే చెబుతూ భారతీయ సంస్కృతిని అందలం ఎక్కిస్తున్నారు.

 

ఇలా న‌మ‌స్క‌రం చేస్తున్న వారి జాబితా పెద్ద‌దే ఉంది. అగ్రరాజ్యం అధినేత ట్రంప్‌ తో మొదలుకొని ఇజ్రాయెల్‌ ప్రధాని,స్పెయిన్‌ రాజు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, బ్రిటన్‌ ప్రిన్స్ ఛార్లెస్ కూడా నమస్కారం చేస్తున్నారు. కరోనా దెబ్బకు షేక్‌ హ్యాండ్‌ కి బ్రేకిచ్చిన అగ్రరాజ్యం అధినేత ట్రంప్...ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ తో భేటీ సందర్భంగా చేతులు జోడించి నమస్తే చెప్పారు. లియో కూడా రెండు చేతులు జోడించి నమస్తే పెట్టడం గ‌మ‌నార్హం.

 

ఇదిలాఉండ‌గా, క‌రోనా కార‌ణంగా ఇటలీలో నిన్న ఒక్కరోజే 189మంది మరణించ‌గా మృతుల సంఖ్య 1016కు చేరింది. మరో 15,113మంది బాధితులు పలు హాస్పిటల్స్‌ లో చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో 429మంది చనిపోగా.. 10,075 పాజిటీవ్‌ కేసులు నమోదు అయ్యాయి. కెనడాలో 30మంది మృతి చెందగా బాధితుల సంఖ్య 1,194కు పెరిగింది. ఇక దక్షిణా కొరియాలో 7470, స్పెయిన్‌ 2968, ఫ్రాన్స్‌ 2221, అమెరికా 1283, జర్మనీలో 1938 కేసులు నమోదు అయ్యాయి.

 


కెన‌డా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీకి కూడా కరోనా సోకినట్టు వైద్యులు దృవీకరించారు. ఆమెకు ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండడంతో ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోఫీ ఇటీవలే బ్రిటన్‌లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: