రోనా వైరస్ ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు జిల్లాలో జోరుగా ప్రచారం అవుతున్నాయ్. ఫలితంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని చోట్ల ఉచితంగానే కోళ్లను పంచి పెట్టారు. పౌల్ట్రీ రైతులను ఈ వైరస్‌ కోలుకోలేని దెబ్బతీసింది. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే పరిశ్రమను మూసేయక తప్పని పరిస్థితి. మరి...కరోనా వైరస్‌పై జిల్లాలో వ్యాపిస్తున్న వదంతులను కట్టడి చేయటం ఎలా?

 

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను కరోనా వైరస్‌ వదంతులు వణికిస్తున్నాయి. కరోనా భయంతో జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. ప్రస్తుతం జనం చికెన్‌ తినడానికే తెగ భయపడిపోతున్నారు. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం అటు కోళ్ల పెంపకంపైనా పడింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రామాపురం పరిధిలో కోళ్లను ఉచితంగా పంచి పెట్టారు. స్థానిక పౌల్ట్రీ రైతు నూకల రామ సూర్యప్రకాశ్‌ కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కోళ్లఫాంల వద్దకు పరుగులు తీశారు. ఒక్కొక్కరూ మూడు, నాలుగు కోళ్లను తెచ్చుకున్నారు. కరోనా భయంతో మార్కెట్‌లో కోళ్లను కొనుగోలు చేయడం లేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దాణా ఖర్చులైనా మిగులుతాయని ఉచితంగా మూడు వేల కోళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

 

ఇక...సూర్యాపేట జిల్లాలో చికెన్ కొనేవారు లేకపోవడంతో కేజీ చికెన్ 20 రూపాయలకే అమ్ముతున్నారు. మామూలు రోజుల్లో కేజీ 150 నుంచి 2 వందల వరకు ఉండేది చికెన్ ధర. అది ఇప్పుడు ఏకంగా ఇరవై రూపాయలకే పడిపోయింది. దీన్ని బట్టే జిల్లా ప్రజల్లో కరోనా వైరస్ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

 

మరోవైపు...యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 3 వందల 50 కోళ్ల ఫాంలున్నాయి. వీటిలో సాధారణంగా 50 లక్షల పిల్లలను పెంచుతుంటారు. ఐతే కరోనా ప్రభావంతో ఇప్పుడు 25 శాతం షెడ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పిల్లలు గల షెడ్లలో పెరుగుతున్న కోళ్లకు దాణా కూడా భారంగా మారింది. దీంతో లైవ్ కోడిని కేజీ 25 రూపాయలకే అమ్మేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

 

అటు...చౌటుప్పల్ మండల కేంద్రంలో వంద రూపాయలకే రెండు కోళ్లను అమ్ముతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు సుమారు 2 వేల కోట్ల వరకు పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలను చవి చూసింది. కరోనా కోళ్ల వల్ల రాదు అంటూ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఒక కిలో కోడి మాంసం 25 రూపాయలకే లభిస్తోంది. 

 

సూర్యాపేట జిల్లాలో చికెన్‌ ధరలు భారీగా తగ్గిపోయాయి. డ్రెస్డ్‌ చికెన్ 20 రూపాయలు, స్కిన్‌లెస్ చికెన్ 40 రూపాయలే అని బోర్డులు పెట్టారు. చికెన్ ధరలు భారీగా తగ్గడంతో నాన్‌వెజ్‌ ప్రియులు, దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. చికెన్‌ను తినడంతో కరోనా వ్యాధి సోకినట్లు ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. కేవలం పుకార్లతోనే చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఇక...కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు. దాణాకు డబ్బులు లేక కోళ్లను ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

 

మొత్తానికి...ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వదంతుల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ మూసివేసే దశకు చేరుకుంది. ఈ వదంతులను కట్టడి చేసేందుకు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: