తెలంగాణ‌లో ప్ర‌స్తుతం వాణిజ్యప‌రంగా ఏకైక ఎయిర్‌పోర్ట్ ఉంది. అదే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌. అయితే, త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులు రానున్నాయ‌ట‌. రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఎఫ్‌ఐసీసీఐ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జ‌రుగుతున్న వింగ్స్ ఇండియా 2020 ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

 

తెలంగాణ వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రమని పేర్కొన్న మంత్రి కేటీఆర్‌...రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదించినట్లుగా చెప్పారు. భద్రాద్రి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్ జిల్లా గుదిబండలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అవకాశం ఉందని కేటీఆర్​ తెలిపారు. త్వ‌ర‌లో వరంగల్‌ విమానాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు తెలిపారు. 

 

ఇదిలాఉండ‌గా, శంషాబాద్‌లోని జీఎంఆర్‌ విమానాశ్రయం ఆవరణలో పైలట్ల శిక్షణాకేంద్రం ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ)ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానరంగ పరిశ్రమలు, అనుబంధ రంగాలకు హైదరాబాద్‌ అనువైన కేంద్రంగా ఉన్నదని తెలిపారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పెట్టుబడులు విమానయాన పరిశ్రమలకు మంచి ఊతమిస్తాయని చెప్పారు. దేశంలో వైమానికరంగానికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్న కేటీఆర్‌... తాత్కాలికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. 

 

ఇదిలాఉండ‌గా, ప్రస్తుతం హర్యానాలోని గుర్గావ్‌లో మాత్రమే ఇటువంటి సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన ఈ శిక్ష‌ణ కేంద్రం రెండోది. పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ అనుమతితో యూరోపియన్‌ ఏజెన్సీ శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎకరం స్థలంలో ఈ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అచ్చం విమానాలను పోలినట్లు ఉండే సిమ్యులేషన్‌ ఫ్లైట్‌లో కొత్తగా ఎంపికైన పైలట్లకు శిక్షణనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: