తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి . అధికార టీఆరెస్ ను ఢీ కొని రాష్ట్రం లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం తో పాటు, సొంత  పార్టీ లోని సీనియర్లను కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది . సంజయ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీ లోని పలువురు సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది . ఎందుకంటే  పార్టీ అధ్యక్ష పదవిని పలువురు ఆశించారు . మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , డీకే అరుణ వంటి వారితోపాటు , లక్ష్మణ్ స్వయంగా మరొక ధపా అధ్యక్షునిగా కొనసాగాలని భావించారు .

 

అయితే  వారందర్ని కాదని బీజేపీ జాతీయనాయకత్వం మాత్రం  సంజయ్ వైపు మొగ్గు చూపింది . పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని, రాష్ట్ర  కమలనాథులు ధిక్కరించే సాహసాన్ని చేయరనేది జగమెరిగిన సత్యమే కానీ,  ఎంతవరకు పార్టీ సీనియర్లు  సంజయ్ కు సహకరిస్తారన్నది మాత్రం ప్రశ్నార్ధకమేనని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి . ఇక రాష్ట్రం లో బీజేపీ బలోపేతం బాధ్యత సంజయ్ భుజస్కందాలపై పడనుంది . అధికార పార్టీ కి తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ , ఒక్క లోక్ సభ ఎన్నికలను మినహాయిస్తే ఇప్పటి వరకు ఆ దిశగా ఏ ఎన్నికల్లోనూ పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు .  నిన్న, మొన్నటి  వరకు పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన లక్ష్మణ్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేశారన్నది నిర్వివాదాంశమే .

 

అయితే లక్ష్మణ్ కు పార్టీలోని సీనియర్ల తో ఎటువంటి ఇబ్బందులన్నవి తలెత్తలేదన్నది అంతే నిష్ఠురమైన నిజం  . ఎందుకంటే లక్ష్మణ్ పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేసి , రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం తో ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించే సాహసం ఎవరు చేయలేదు . కానీ సంజయ్ విషయానికొస్తే ఆలా కాదని బీజేపీ వర్గాలు అంటున్నాయి . పార్టీ జాతీయ నాయకత్వం ఆశీస్సులతో ఏకంగా అధ్యక పదవి చేపట్టబోతున్న సంజయ్ కు ముందున్నదంతా ముళ్లబాటేనని చెప్పకనే చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: