భారత్ లో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది . పశ్చిమ ఢిల్లీ కి చెందిన 68 మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి లో కరోనా వైరస్ వ్యాధితో  మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . ఈ విషయాన్నీ ఢిల్లీ వైద్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ ధృవీకరించారు . మృతి చెందిన మహిళ , ఆమె కుమారుడు గత నెలలో స్విట్జార్  లాండ్ , ఇటలీలలో   పర్యటించి భారత్ కు తిరిగి వచ్చారు . వారిద్దర్నీ పరీక్షించగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడం తో , ఈ నెల ఏడవ తేదీన చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు .

 

మృతి చెందిన మహిళకు డయాబెటిస్ , బిపి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు . ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి సదరు  మహిళ ఆరోగ్యం మరింత క్షిణించడం తో ఆమెను వెంటిలేటర్ పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు . అయితే ఈ రోజు ఆరోగ్యం పూర్తిగా క్షిణించి సదరు మహిళ మృతి చెందిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . కర్ణాటక లో తొలి కరోనా మృతి సంభవించిన 24 గంటల వ్యవధిలోనే మరొక వ్యక్తి మృతి చెందడం తో కేంద్రం అప్రమత్తమైంది . ఇప్పటికే అన్ని దేశాల నుంచి టూరిస్ట్ ల రాకపోకలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది .

 

దేశ వ్యాప్తంగా ఇప్పటికే 81  మందికి కరోనా వైరస్ వ్యాధి ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు . దేశం లోను కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకింత పెరుగుతుండడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది . కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పించిన సామాన్యులు మాత్రం ఇంకా భయాందోళనతోనే రోజువారీ జీవితాన్ని  గడుపుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: