ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం గొర్రెల కాపరుల కోసం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌సీడీసీ) సహాయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారుడు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేయటానికి ప్రభుత్వం లక్షన్నర రూపాయలు మంజూరు చేయనుంది. వైఎస్సార్ కాపరి బంధు పేరుతో రాష్ట్రంలో ఈ పథకం అమలు కానుంది. 
 
ప్రభుత్వం లబ్ధిదారులకు యూనిట్ల కొనుగోలు కోసం మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుందని సమాచారం.  ఈ పథకం ద్వారా రాబోయే నాలుగేళ్లలో 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఎన్‌సీడీసీ ఈ పథకం కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించిందని సమాచారం. కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ ను గొర్రెల కాపరుల సొసైటీ అధ్యక్షులు కలిసి తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి ఒక పథకం అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జగన్ రాష్ట్రంలో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 
 
ఎన్‌సీడీసీ ఆర్థిక సాయానికి సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో గొర్రెల కాపరులకు రుణాలు పొందటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు, సబ్సీడీని పెంచారు. గొర్రెల కాపరులు భూమిని తనఖా పెట్టి రుణం తీసుకునే విధానం అమలులో ఉండగా అందులో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 
 
ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో రాజన్న పశు వైద్యం, వైఎస్సార్ పశు నష్ట పరిహారం లాంటి పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోతే వాటికి ప్రీమియం చెల్లించకపోయినా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. ప్రభుత్వం నష్ట పరిహారం కోసం తొలి విడతలో భాగంగా 35 కోట్ల రూపాయలు కేటాయించింది. రాజన్న పశు వైద్యం పథకాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలులోకి తీసుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: