దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ నిన్న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో విధానపరమైన లోపం ఉందని పేర్కొన్నాడు. కోర్టులో వినయ్ శర్మ తరపున అతని లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష వాయిదా పడిన ఈ కేసులో మార్చి 6న కొత్త డెత్ వారంట్ జారీ అయింది. పటియాలా హౌస్ కోర్టు మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఆదేశించింది. ఇప్పటికే దోషులు కోర్టులు, రాష్ట్రపతి వద్ద మెర్సీ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేశారు. వినయ్ శర్మ వేసిన పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే మరోసారి ఉరి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. 
 
మార్చి 6న తాజా డెత్ వారంట్ జారీ అయిన తరువాత దోషులలో ఒకరైన ముకేష్ మార్చి 7న తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించాడు. కోర్టు ఆ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరపాలని నిర్ణయించింది. మరో దోషి పవన్ గుప్తా తీహార్ జైలులో తనను అధికారులు నిత్యం కొడుతున్నారని, జైలులో దారుణంగా హింసిస్తున్నారని రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇప్పటికే ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి దోషులు అన్ని రకాల పిటిషన్లు దాఖలు చేసి అవకాశాలు వినియోగించుకున్నారు. కోర్టు తాజాగా డెత్ వారంట్ జారీ చేయడంతో కొత్త పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిందితులు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేస్తూ మరోసారి ఉరి వాయిదా పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దోషులు దాఖలు చేసిన కొన్ని పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. మరోసారి నిర్భయ దోషుల ఉరి వాయిదా పడుతుందా...? లేదా...? తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: