ఇంట్లో కూర్చుని కావాల్సిన‌ సరుకులు, అవ‌స‌ర‌మైన భోజ‌నం ఆర్డర్‌ చేసినట్లు ఆన్‌లైన్‌లో మనకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడొచ్చు. అదెలా అంటే...స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని! అన్ని అవసరాలతో పాటు ప్రేమ ​కోసం కూడా కొన్ని యాప్‌లు, సైట్లు పుట్టుకొచ్చాయనే సంగ‌తి తెలిసిందే. డేటింగ్‌ యాప్స్‌, సైట్లు అందుబాటులోకి రావ‌డంతో ఈ కొత్త‌ సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలో వేళ్లూనుకుపోతోంది. ఈ సైట్ల‌లో న‌మోదు అయి అభిరుచులు, అభిప్రాయాలు.. నచ్చిన భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే, సోషల్‌ మీడియా పుణ్యమా అని పరిచయం లేని వాళ్లతో కొత్త స్నేహాలు పుట్టుకొస్తుండ‌గా మోసాలు కూడా అలాగే జ‌రుగుతున్నాయి. తాజాగా ఓ వ్య‌క్తి విష‌యంలో జ‌రిగింది.

 

సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డేటింగ్‌ వెబ్‌సైట్ ద్వారా రూ. 74 వేలు బొక్క పెట్టుకున్న ఓ వ్య‌క్తి ఉదంతం ఇది. పాతబస్తీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగికి డేటింగ్ మీద మ‌న‌సు పుట్టింది. దీంతో  ఇంటర్‌నెట్‌లో `అలాంటి సైట్ల కోసం` వెతుకుతుండ‌గా...డేటింగ్‌ అవకాశమిస్తామని, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ ఓ వెబ్‌సైట్‌లో ఆఫ‌ర్ క‌నిపించింది. ఫీజు రూ. 1200 అని చెప్ప‌డంతో అవి క‌ట్టేశాడు. అయితే,  అనంతరం...హెల్త్‌ ప్రొఫైల్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ ఇంకొన్ని డ‌బ్బులు లాగేశారు. ఇలా మొత్తం రూ. 74 వేలు గుంజేశారు. అక్క‌డితో ఆగ‌కుండా... ఇంకా డ‌బ్బులు అడుగుతుండడంతో అప్పుడు మ‌నోడికి తెలివి వ‌చ్చి... మోసం అని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌న‌కు టోకరా వేశారని వాపోవ‌డంతో పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

 

కాగా, డేటింగ్ సైట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వాడుతున్న డేటింగ్ యాప్‌లు, సైట్ల‌లో...మోసం చేయాలనే దురుద్దేశంతోనే వీటిని వాడుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు. జాగ్ర‌త్త వ‌హించ‌కుండా ఆక‌ర్ష‌ణ‌తో డేటింగ్ సైట్ ఆశ్ర‌యించి వారి వలలో పడి మోసపోయిన వారు కుటుంబ సభ్యులకు, పోలీసులకు కానీ చెప్పడానికి భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే మథనపడుతున్నారు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొంటున్న నిపుణులు...అన్యాయం జ‌రిగితే వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: