ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 
 
నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను,  కృష్ణపట్నం పోర్టును అప్రమత్తం చేసింది. సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు ఈ నెల 18వరకు సెలవులు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలతో పాటు థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ కూడా బంద్ కానున్నాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు జిల్లాలో పాఠశాలలు, థియేటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. 
 
జిల్లా ప్రజలు వీలైనంత వరకు బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కరోనా లక్షణాలతో 9 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 150 మంది కరోనా అనుమానితులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా బాధితులను జిల్లాలోని రెండు ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. 
 
కరోనా మృతుల సంఖ్య 5,000 దాటగా కేసుల సంఖ్య 1,34,000కు చేరింది. చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్నా కొన్ని దేశాలలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కారణంగా గురువారం ఒక్కరోజే ఇరాన్ లో 85 మంది మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 1600కు చేరింది. చైనా అధికారి ఒకరు అమెరికా నుంచి చైనాకు వచ్చిన సైన్యం ద్వారానే కరోనా చైనాకు చేరిందని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చైనా, అమెరికాల మధ్య వివాదానికి కారణమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: